‘కాసా’ నుంచి ‘టర్మ్‌’కు డిపాజిటర్ల చూపు! బ్యాంకుల లాభాలపై ప్రభావం

13 Oct, 2023 09:33 IST|Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో కరెంట్‌ అకౌంట్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ (సీఏఎస్‌ఏ– కాసా) డిపాజిట్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. బ్యాంకు వినియోగదారులు వేగంగా టర్మ్‌ డిపాజిట్ల వైపునకు మారిపోతున్నారు. కాసాలో అతి తక్కువ వడ్డీరేటు, టర్మ్‌ డిపాజిట్లలో కొంత మెరుగైన వడ్డీరేటు ఈ పరిస్థితికి కారణమని పారిశ్రామిక ప్రాతినిధ్య సంస్థ– ఫిక్కీ, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) విడుదల చేసిన సర్వే (17వ రౌండ్‌) ఒకటి పేర్కొంది.

ఈ పరిస్థితి బ్యాంకుల లాభాలపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా నిపుణుల అభిప్రాయం. కాసా అంటే బ్యాంకులు సమీకరించే తక్కువ వడ్డీరేటు డిపాజిట్లు. అధిక మొత్తంలో తక్కువ వడ్డీ వ్యయాల డిపాజిట్లు ఒక బ్యాంకుకు  ఉన్నాయంటే ఆ బ్యాంకుకు మెరుగైన మార్జిన్‌లు ఉంటాయని అర్థం. 

సర్వేలోని మరికొన్ని ముఖ్యాంశాలు.. 

  • మౌలిక సదుపాయాలు, టెక్స్‌టైల్స్‌ రసాయనాలు వంటి రంగాలు నిరంతర వృద్ధిని సాధిస్తున్నందున, ఆయా రంగాల్లో దీర్ఘకాలిక క్రెడిట్‌ డిమాండ్‌ ఉంటుంది.  
  • ఫుడ్‌ ప్రాసెసింగ్, మెటల్స్, ఐరన్,  స్టీల్‌ రంగాల్లో  కూడా గత ఆరు నెలల్లో వేగవంతమైన దీర్ఘకాలిక రుణాల పంపిణీ జరిగింది.  
  • మౌలిక రంగాన్ని పరిశీలిస్తే,  16వ రౌండ్‌ సర్వేలో  57 శాతం మంది  ఈ రంగంలో రుణ వృద్ధి ఉందని పేర్కొంటే, ప్రస్తుత 17వ రౌండ్‌లో ఈ సంఖ్య 67కు పెరిగింది. 
  • వచ్చే ఆరు నెలల్లో నాన్‌–ఫుడ్‌ ఇండస్ట్రీలో భారీ రుణ వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  
  • గడచిన ఆరు నెలల్లో తమ మొండిబకాయిలు తగ్గాయని సర్వేలో పాల్గొన్న బ్యాంకర్లలో 75 శాతం మంది తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో మొండిబకాయిలు 3 నుంచి 4 శాతం వరకే ఉంటాయని బ్యాంకర్లలో మెజారిటీ విశ్వసిస్తున్నారు.  
  • సుస్థిర దేశీయ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ మూలధన వ్యయంతో కూడిన రుణ వృద్ధి, పటిష్ట ఆర్థిక పునరుద్ధరణ యంత్రాంగం, మొండిబకాయిలకు అధిక నిధులు కేటాయింపు (పొవిజనింగ్‌), భారీ రైట్‌–ఆఫ్‌ (పుస్తకాల నుంచి మొండి పద్దుల రద్దు)  వంటి అంశాలు రానున్న ఆరు నెలల్లో బ్యాంకింగ్‌ రుణ నాణ్యత మెరుగుదలకు కారణం. 

సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి

మరిన్ని వార్తలు