ఐటీకి బ్యాడ్‌ టైమ్‌.. 25 ఏళ్ల టెక్నాలజీ చరిత్రలో ఇదే తొలిసారి!

30 Oct, 2023 20:26 IST|Sakshi

భారత ఐటీ రంగం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. చాలా వరకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. క్లయింట్స్ తగ్గిపోయారు. ఇదే సమయంలో చాలా వరకు దిగ్గజ ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఉద్యోగులను తీసేయడంతో పాటు.. కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్స్ ఇచ్చి చేర్చుకోవడంలో జాప్యం చేస్తున్నాయి. వారిని వేతనాలు తగ్గించుకొని చేరాలని చెబుతున్నాయి.

ఫలితంగా జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఐటీ సేవలందించే 10 కంపెనీలలో తొమ్మిదింటిలో నియామకాలు తగ్గాయి. నివేదిక ప్రకారం, 25 ఏళ్ల దేశ ఐటీ రంగ చరిత్రలో నియామకాలు తగ్గడం ఇదే తొలిసారి. 

జులై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ2) ముగింపు నాటికి ప్రముఖ టాప్ 10 భారత ఐటీ కంపెనీల్లో వర్క్‌ఫోర్స్ 2.06 మిలియన్లకు పడిపోయింది. త్రైమాసికం ప్రారంభంలో ఈ సంస్థలు 2.11 మిలియన్ల ఉద్యోగులను కలిగి ఉన్నాయి.

ఒక్క ఎల్‌ అండ్‌ టీ మాత్రమే 
ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్ మాత్రమే ఉద్యోగుల నియామకాల్లో వృద్దిని సాధించింది. క్యూ2లో 32 మంది ఉద్యోగులను నియమించుకుంది. తద్వారా హెడ్‌కౌంట్‌ను ఆల్ టైమ్ హై 22,265కి చేరింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్, విప్రో, టెక్ మహీంద్రా, పెర్సిస్టెంట్ సహా ఇతర ప్రధాన సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి.  

అనిశ్చితే కారణం
ఈ సందర్భంగా టీమ్‌లీజ్ డిజిటల్ స్టాఫింగ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ చెమ్మన్‌కోటిల్‌ను మాట్లాడుతూ..మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఉద్యోగుల నియమకాలు తక్కువగా ఉన్నాయి. చివరి నాటికి ఈ హెడ్‌కౌంట్‌ ఇంకా తగ్గే అవకాశం ఉంది. వర్క్‌ ప్రొడక్టివిటీని పెంచే టెక్నాలజీతో పాటు గిగ్స్ వంటి విభాగాల ఉద్యోగుల నియామకాలు ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు.     

మరిన్ని వార్తలు