ఆ మూడు బ్యాంకుల్లో కోట్ల రూపాయల కుంభకోణం.. సీబీఐ విచారణకు ఆదేశం

4 Dec, 2023 14:13 IST|Sakshi

కర్ణాటకలోని మూడు సహకార బ్యాంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు జరిగియని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. త్వరలో ఈ బ్యాంకులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీఈఐ) విచారణ జరపనున్నట్లు తెలిపారు. అందుకు సీబీఐకు విచారణ చేపట్టేందుకు ఆమోదం లభించినట్లు ముఖ్యమంత్రి తన ఎక్స్‌ ఖాతాలో  తెలిపారు. గురు రాఘవేంద్ర కోఆపరేటివ్ బ్యాంక్, వశిష్ఠ బ్యాంక్, గురు సావరిన్ బ్యాంకుల్లో జరిగిన కుంభకోణాల్లోని బాధ్యులు త్వరలోనే బయటపడతారని తెలిపారు.

‘వేలాది మంది డిపాజిటర్లు ఎన్నో కలలతో తమ కష్టార్జితాన్ని ఈ బ్యాంకుల్లో పొదుపు చేసుకున్నారు. బ్యాంకర్ల మోసగించడంతో వారి భవిష్యత్‌ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా మోసపోయిన డిపాజిటర్లకు న్యాయం చేయాలని పోరాడాను. సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఇప్పటికి అది సాకారమైంది' అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్‌ఫర్‌..! కానీ..

శ్రీ గురు రాఘవేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, వశిష్ఠ క్రెడిట్ సౌహార్ద కో-ఆపరేటివ్ లిమిటెడ్, గురు సార్వబహుమ సౌహార్ద క్రెడిట్ మేనేజ్‌మెంట్ పై సీబీఐ విచారణ జరపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆయా బ్యాంకుల బోర్డు డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, సిబ్బంది చేసిన కోట్లాది రూపాయల మోసాలను బయటపెట్టేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు