జీరో బ్యాలెన్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌లపై పరిమితులు ఎత్తేయాలి

31 Oct, 2022 07:32 IST|Sakshi

న్యూఢిల్లీ: జీరో బ్యాలన్స్‌తో కూడిన బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ (బీఎస్‌బీడీ) ఖాతాల నుంచి డిజిటల్‌ చెల్లింపులపై ఉపసంహరణ పరిమితులు ఎత్తివేయాలని ఐఐటీ బోంబే నివేదిక సూచించింది. ఈ ఖాతాలకు సంబంధించి విత్‌డ్రాయల్‌ పరిమితులు ఆర్‌బీఐ నియంత్రణల వెలుపల ఉండాలని అభిప్రాయపడింది.

ఈ కామర్స్‌ లావాదేవీలపై 0.3 శాతం మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటును ప్రభుత్వం అమలు చేసేందుకు అనుమతించాలి సూచించింది. 0.3 శాతం మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌) రూపంలో ఏటా రూ.5,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని, దీన్ని యూపీఐ సదుపాయాల బలోపేతానికి ఉపయోగించకోవచ్చని పేర్కొంది. డిజిటల్‌ పేమెంట్‌ ఫెసిలిటేషన్‌ ఫీజు మాదిరే ఈ కామర్స్‌ మర్చంట్స్, ఇనిస్టిట్యూషన్స్‌ నిర్వహించే డిజిటల్‌ లావాదేవీలపై ఎండీఆర్‌ విధించొచ్చని తెలిపింది. 

‘‘ప్రస్తుత డిజిటల్‌ చెల్లింపుల దశకంలో.. డిజిటల్‌ చెల్లింపులను పాత తరానికి చెందిన సేవింగ్స్‌ డిపాజిట్‌ ఖాతాల ఉపసంహరణ పరిమితుల పరిధి నుంచి తొలగించాలి. కొన్ని బ్యాంక్‌లు లావాదేవీలపై నియంత్రణలు విధిస్తున్నాయి. 

ఉదాహరణకు ముంబైకి చెందిన ఒక బ్యాంక్‌ ఒక నెలలో బీఎస్‌బీడీ ఖాతాల నుంచి 10 సార్ల వరకే ఉపసంహరణలను పరిమితం చేసింది. సేవింగ్స్‌ ఖాతా అన్నది లావాదేవీల కోసం కాదు. కనీస పొదుపు కోసం. ధనిక, పేద మధ్య ఈ ఖాతాల విషయంలో వ్యత్యాసం చూపకూడదు. కావాలంటే ఖాతాలను బట్టి సర్వీజు చార్జీలు భిన్నంగా ఉండొచ్చు. అంతే కానీ, సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ అకౌంట్ల మధ్య ఉపసంహరణ లావాదేవీల పరంగా పరిమితులు విధించడం వివక్ష కిందకు వస్తుంది. సమానత్వ హక్కుకు భంగం కలిగిస్తుంది’’అని ఈ నివేదిక పేర్కొంది.    

మరిన్ని వార్తలు