‘ఆ కంపెనీకి ప్రత్యేక రాయితీలుండవు..’

1 Dec, 2023 21:23 IST|Sakshi

దేశంలోకి టెస్లా కార్లు ప్రవేశపెట్టేలా ఎలాన్‌మస్క్‌ ప్రయ‍త్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా దేశంలో కార్లు తయారీ కేంద్రాలు నెలకొల్పోందుకు కొన్ని మినహాయింపులు, రాయితీలు అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం ప్రత్యేకంగా టెస్లాకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. 

విద్యుత్‌ వాహన రంగంలో ఒక కంపెనీకి నిర్దిష్టంగా ప్రోత్సాహకాలు, మినహాయింపులు ఇవ్వడం జరగదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఒకవేళ అలాంటివి ఏవైనా ఉంటే దేశంలో ప్రవేశించాలనుకునే వారితో పాటు ఈవీ తయారీదారులందరికీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందని పేర్కొన్నారు. టెస్లా డిమాండ్‌పై వివిధ మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరిగాయన్నది వాస్తవమే అయినప్పటికీ.. తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేశారు.

టెస్లా 2021 నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని కోరుతోంది. పూర్తిగా విదేశాల్లో తయారై భారత్‌కు వచ్చే వాహనాలపై ప్రస్తుతం 100 శాతం వరకు సుంకం వర్తిస్తోంది. విలువతో సంబంధం లేకుండా ఈ సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలని టెస్లా కోరింది. దీనికి ససేమిరా అన్న ప్రభుత్వం దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలను కొనుగోలు చేయాలని షరతు విధించింది. దీంతో టెస్లా ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది.

ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ, ఎలాన్‌ మస్క్‌ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సైతం కాలిఫోర్నియాలోని టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. దీంతో టెస్లా ఎంట్రీకి సంబంధించిన ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో టెస్లాకు కస్టమ్స్‌ సుంకంలో భారత్‌ మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు ఒక కంపెనీకి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని దేశీయ ఈవీ తయారీ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

మరిన్ని వార్తలు