ఐకియా ఫ్యామిలీ క్రెడిట్‌ కార్డ్‌ 

15 Oct, 2020 08:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఫర్నీచర్‌ రంగ సంస్థ ఐకియా తాజాగా ఫ్యామిలీ క్రెడిట్‌ కార్డును అందుబాటులోకి తెచ్చింది. సిటీ బ్యాంక్‌ భాగస్వామ్యంతో మాస్టర్‌కార్డ్‌ ఈ కార్డును ప్రవేశపెట్టింది. ఈ కార్డుతో స్టోర్‌లో భారత్‌ క్యూఆర్‌ ద్వారా చెల్లింపులు జరుపవచ్చు. రివార్డు పాయింట్లూ పొందవచ్చు. ఆకర్షణీయ ఈఎంఐలు అందుకోవచ్చని ఐకియా ఇండియా కమర్షియల్‌ మేనేజర్‌ కవితరావు బుధవారం తెలిపారు. జాయినింగ్, వార్షిక ఫీజు ఏవీ ఉండవు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కస్టమర్లు ఐకియా ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. కాగా, ఫిన్స్‌లిప్యాడ్, నాస్ట్రైట్‌ పేరుతో టెక్స్‌టైల్స్, డెకోరేటివ్స్‌ శ్రేణిలో మేడిన్‌ ఇండియా ఫెస్టివ్‌ కలెక్షన్‌ను కంపెనీ  విడుదల చేసింది.   

ఆ టిప్స్‌తో జాగ్రత్త!

  • లిస్టెడ్‌ సంస్థల్లో పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు సెబీ హెచ్చరిక 

న్యూఢిల్లీ: లిస్టెడ్‌ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి అయాచిత టిప్స్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఇన్వెస్టర్లను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరించింది. సెక్యూరిటీస్‌ మార్కెట్లో లావాదేవీలు జరపడానికి ముందుగా తగు రీతిలో మదింపు చేయాలని సూచించింది. రకరకాల షేర్లలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలంటూ బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు, వెబ్‌సైట్లు, వాట్సాప్‌.. టెలిగ్రాం వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా భారీ స్థాయిలో అయాచిత సలహాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సెబీ ఈ ప్రకటన చేసింది. 

గృహ రుణ సర్వీసుల్లోకి మ్యాజిక్‌బ్రిక్స్‌ 
న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ పోర్టల్‌ మ్యాజిక్‌బ్రిక్స్‌ గృహరుణ సర్వీసుల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా పలు ప్రధాన బ్యాంకులతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఆవిష్కరణ నుంచి లావాదేవి దశ వరకు ఇంటి కోనుగోలుదారులకు సమగ్రమైన సేవలను అందించడమే లక్ష్యమని  పేర్కొంది. రుణాలు తీసుకోవాలనుకునే వారు ఆప్లికేషన్‌ ప్రాసెస్‌ ద్వారా ఉత్తమ ఆఫర్‌ రేట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లలో పోల్చి చూసుకోవచ్చు. 

ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్లకు విరివిగా రుణం 
సాక్షి, హైదరాబాద్: రానున్న పండుగల సీజన్‌ నేపథ్యంలో ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తన వినియోగదార్లకు విస్తృత స్థాయిలో రుణ లభ్యత కోసం నడుం బిగించింది. 17 బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు, ఫిన్‌టెక్‌ సంస్థలతో చేతులు కలిపినట్టు ప్రకటించింది. వీటిలో ఎస్‌బీఐ, ఎస్‌బీఐ కార్డ్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, కొటక్‌ మహీంద్రా, ఫెడరల్‌ బ్యాంక్, పేటీఎం తదితర సంస్థలు ఉన్నాయి. కొత్త కస్టమర్లను ఆకర్శించే లక్ష్యంతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకుంది. తద్వారా 25 కోట్లకుపైగా ఉత్పత్తులను వినియోగదార్లకు చేరువ చేయాలన్నదే సంస్థ ధ్యేయం. అలాగే ఏడు కోట్ల మందికిపైగా కస్టమర్లకు క్రెడిట్‌ సౌకర్యం అందిస్తుందని తెలిపింది. 60 బ్రాండ్లకు చెందిన గిఫ్ట్‌ కార్డులను కూడా ఆఫర్‌ చేస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోం ఫర్నీషింగ్‌ ఉత్పత్తులకు భారీ డిమాండ్‌ ఉంటుందని ఫ్లిప్‌కార్డ్‌ ఫిన్‌టెక్, పేమెంట్స్‌ గ్రూప్‌ హెడ్‌ రంజిత్‌ బోయనపల్లి ఈ సందర్భంగా తెలిపారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా