పండగ సీజన్‌లో దినదిన గండం..టెక్కీల నెత్తిపై మరో పిడుగు!

14 Nov, 2023 12:41 IST|Sakshi

మరికొన్ని రోజుల్లో ఏడాది ముగుస్తుంది. కొత్త ఏడాది ప్రారంభం కానుంది. కానీ టెక్‌ కంపెనీలు మాత్రం  ఉద్యోగుల తొలగింపుల్ని ఆపడం లేదు. ఈ ఏడాదితో  ప్రారంభమైన లేఆఫ్స్‌ కారణంగా ఇప్పటి వరకు 244,342 మంది ఉపాధి కోల్పోయారు. 2022 నుంచి ఇప్పటి వరకు 50 శాతం పెరుగుదలతో ఆయా కంపెనీలు సిబ్బందిని ఇంటికి సాగనంపాయి. వాటిల్లో గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌తో పాటు చిన్న చిన్న ఫిన్‌ టెక్‌ కంపెనీలు, యాప్స్‌ నిర్వహణ సంస్థలున్నాయి.       

అయితే వీటిల్లో కొన్ని సంస్థలు ఉద్యోగుల తొలగింపుల్లో కాస్త వెనక్కి తగ్గడంతో.. ఇక లేఆఫ్స్‌ ఉండవనే అంచనాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో తాజాగా, ఐటీ ఉద్యోగులపై మరో పిడుగు పడేలా ఉందనే అంశం తెరపైకి వచ్చింది. 

గూగుల్‌, అమెజాన్‌, స్నాప్‌ వంటి సంస్థలు ఫెస్టివల్‌ సీజన్‌లో సిబ్బందికి ఉద్వాసన పలికేందుకు మొగ్గు చూపాయి. ఫలితంగా మరోసారి ప్రొడక్ట్‌ మేనేజ్మెంట్‌, కస్టమర్‌ సర్వీస్‌, ఇంజినీరింగ్‌ విభాగాల ఉద్యోగుల్ని ఫైర్‌ చేసేందుకు సిద్ధపడినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ కంపెనీలతో పాటు మరికొన్ని సంస్థలు అదే బాటులో ఉన్నట్లు సమాచారం.  

గూగుల్‌లో తొలగింపులు 
టెక్‌ దిగ్గజం గూగుల్‌ కొనుగోలు దారుల నుంచి వచ్చే సమస్యల్ని పరిష్కరించే యూజర్‌ అండ్‌ ప్రొడక్ట్‌ విభాగాల ఉద్యోగుల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై స్పందించిన గూగుల్‌.. తొలగింపులు తక్కువేనని సెలవిచ్చింది. అయినా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆల్ఫబెట్‌ అనుంబంధ సంస్థల్లో వెరిలి, వేమూ, గూగుల్ న్యూస్ విభాగాల్లో పనిచేసే సిబ్బందిపై ప్రభావం పడనుంది. భవిష్యత్‌లో మరింత వృద్ధి సాధించేందుకు అవకాశం ఉన్న రంగాలైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లపై దృష్టిసారిస్తున్నట్లు వెల్లడించింది. 


అమెజాన్‌లో లేఆఫ్స్‌
గూగుల్‌ బాటలో ఈకామర్స్‌ జెయింట్‌ అమెజాన్‌ మ్యూజిక్‌ విభాగం ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు వెల్లడించింది. నార్త్‌ అమెరికా, లాటిన్‌ అమెరికా, యూరప్‌లోని ఉద్యోగులపై ప్రభావం చూపుతోంది. ఈ కోతలు కస్టమర్ అవసరాలకు ప్రాధాన్యతనివ్వడం, దీర్ఘకాలిక వ్యాపార అవకాశాల్ని గుర్తించడంలో భాగమేనని అమెజాన్‌ నొక్కి చెప్పింది.  

గూగుల్‌, అమెజాన్‌ బాటలో స్నాప్‌
ఇప్పటికీ ఉద్యోగాలను తగ్గించుకుంటున్న కంపెనీల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ స్నాప్ కూడా చేరింది. స్నాప్‌ తన ప్రొడక్ట్‌ బృందంలో పనిచేస్తున్న దాదాపు 20 మందిని తొలగించింది. ఖర్చుల్ని తగ్గించుకునే పనిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. స్నాప్‌లో తొలగించనున్న వారిలో ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌తో సహా ఇతర విభాగాల్లోని ఉన్నత స్థాయి ఉద్యోగులు ఉన్నారు. 


కారణాలు ఇవే

ఉద్యోగుల తొలగింపులకు ఆర్థిక మందగమనం కారణంగా ఆదాయం తగ్గడమేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి, కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. చాలా కంపెనీలు ఉద్యోగులు తొలగింపులు వారి వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ, భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రాజెక్ట్‌లు,ప్రస్తుత ఆర్థిక, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయడంలో ఓ భాగమేనని తెలిపాయి. దీంతో పాటు పుట్టుకొస్తున్న కొత్త టెక్నాలజీలు, మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు టెక్నాలజీ రంగంపై పడుతున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

చదవండి👉 ఉద్యోగం నుంచి తొలగించింది.. మళ్లీ చేరొచ్చంటూ 4 సార్లు ఆఫర్‌ ఇచ్చిన అమెజాన్‌, రిజెక్ట్‌ చేసిన ఉద్యోగి!

మరిన్ని వార్తలు