పెట్రోల్, డీజిల్‌పై మెరుగుపడిన మార్జిన్లు

10 Jun, 2023 04:33 IST|Sakshi

కానీ నష్టాలు భర్తీ అయ్యాకే రేట్ల తగ్గింపు

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌ విక్రయాలపై ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్‌ సంస్థలకు మార్జిన్లు మెరుగుపడ్డాయి. అయినప్పటికీ అవి .. రేట్లను మాత్రం ఇప్పటికిప్పుడు తగ్గించే యోచనలో లేవు.  గతేడాది వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకున్న తర్వాతే ధరల అంశాన్ని పరిశీలించే అవకాశం ఉందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

నష్టాల భర్తీ మాత్రమే కాకుండా చమురు ధరల తగ్గుదల ఎన్నాళ్ల పాటు కొనసాగుతుందో కూడా వేచి చూడాలని ఆయిల్‌ కంపెనీలు యోచిస్తున్నట్లు వివరించారు. 2022 నాలుగో త్రైమాసికం నుంచి పెట్రోల్‌ విక్రయాలపై ఆయిల్‌ కంపెనీల మార్జిన్లు సానుకూలంగా మారాయని, గత నెల నుంచి డీజిల్‌ అమ్మకాలపైనా లీటరుకు 50 పైసల మేర లాభం వస్తోందని అధికారి చెప్పారు.

కానీ గతేడాది వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఇది సరిపోదన్నారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంతో గతేడాది మార్చిలో చమురు ధర బ్యారెల్‌కు 139 డాలర్ల స్థాయికి ఎగిసింది. ప్రస్తుతం 75–76 డాలర్లకు దిగి వచ్చింది. కొన్నాళ్లుగా రేట్లను సవరించకపోవడంతో చమురు కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు రూ. 17.4, డీజిల్‌పై రూ. 27.7 చొప్పున నష్టపోయాయి. 2022 అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో పెట్రోల్‌పై మార్జిను లీటరుకు రూ. 10 మేర వచ్చినప్పటికీ డీజిల్‌పై మాత్రం రూ. 6.5 చొప్పున నష్టం కొనసాగింది. తర్వాత త్రైమాసికంలో పెట్రోల్‌పై మార్జిన్‌ రూ. 6.8 స్థాయికి తగ్గగా.. డీజిల్‌పై మార్జిన్‌ రూ. 0.50కి మెరుగుపడింది.  

మరిన్ని వార్తలు