ఐవోసీ భారీ పెట్టుబడులకు రెడీ

26 Aug, 2023 05:15 IST|Sakshi

ఈ దశాబ్దంలో రూ. 4 లక్షల కోట్లు

చమురు శుద్ధి సామర్థ్య విస్తరణకు సై

న్యూఢిల్లీ: నంబర్‌ వన్‌ ఇంధన రిటైల్‌ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. ఈ దశాబ్దంలో రూ. 4 లక్షల కోట్లకుపైగా వెచి్చంచనున్నట్లు ప్రభుత్వ రంగ బ్లూచిప్‌ కంపెనీ తాజాగా వెల్లడించింది. తద్వారా చమురు శుద్ధి, పెట్రోకెమికల్‌ బిజినెస్‌ల విస్తరణతోపాటు.. ఇంధన పరివర్తన ప్రాజెక్టులలోనూ ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు పేర్కొంది. వెరసి 360 డిగ్రీల ఇంధన దిగ్గజంగా ఆవిర్భవించాలని చూస్తున్నట్లు కంపెనీ చైర్మన్‌ శ్రీకాంత్‌ మాధవ్‌ వైద్య తెలియజేశారు.  

విభాగాలవారీగా..
తాజా పెట్టుబడుల్లో రూ. లక్ష కోట్లను చమురు శుద్ధి సామర్థ్య విస్తరణకు వెచ్చించనుంది. పూర్తి కర్బనరహిత(నెట్‌ జీరో) కార్యకలాపాలను సాధించే బాటలో రూ. 2.4 కోట్లను సంబంధిత ప్రాజెక్టులకు కేటాయించనుంది. ఒడిషాలోని పారదీప్‌లో అత్యంత భారీ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుపై మరో రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది.

దీంతో దేశీయంగా పెరుగుతున్న ఇంధన అవసరాలను అందుకోవడంతోపాటు..  ఇంధన పరివర్తనను సైతం సాధించే వీలున్నట్లు కంపెనీ సాధారణ వార్షిక సమావేశంలో వాటాదారులకు ఐవోసీ చైర్మన్‌ వైద్య వివరించారు.

దేశీ ఇంధన మార్కెట్లో 40 శాతం వాటాను ఆక్రమిస్తున్న కంపెనీ 2046కల్లా పూర్తి కర్బన రహిత కార్యకలాపాలను సాధించాలని ఆశిస్తోంది. భారీ పెట్టుబడుల కారణంగా రిఫైనింగ్‌ సామర్థ్యాలను 33 శాతంమేర పెంచుకోనున్నట్లు వైద్య తెలియజేశారు. దీంతో త్వరలోనే 10.7 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యానికి చేరుకోనున్నట్లు వెల్లడించారు.    
బీఎస్‌ఈలో ఐవోసీ షేరు వారాంతాన 0.5 శాతం నీరసించి రూ. 92 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు