రేపటి నగరాలను నిర్మించేదెలా?

22 Nov, 2023 04:49 IST|Sakshi

అభిప్రాయం

ప్రపంచవ్యాప్తంగా జీడీపీలో దాదాపు 80 శాతం వాటా సమకూరుస్తూ నగరాలు ప్రధాన ఆదాయ సముపార్జన కేంద్రాలుగా మారుతున్నాయి. భారతదేశంలో కూడా ఇందుకు భిన్నమైన పరిస్థితులు లేవు. దేశంలోని ముంబై, ఢిల్లీ వంటి నగరాలు ప్రపంచంలోని కొన్ని దేశాల కంటే అధికంగా జీడీపీని సమకూరుస్తున్నాయి. మన నగరాలను అభివృద్ధి పథంలో నిలపడానికి కొత్తగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న సదుపాయాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడంలో ప్రభుత్వాలకున్న పరిమితుల దృష్ట్యా ప్రైవేటు పెట్టుబడులను సమీకరించడం నేడు అనివార్యంగా మారింది. విశాఖపట్నం లాంటి నగరాలు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడానికి వినూత్న ఆదాయ నమూనాలను విజయవంతంగా వినియోగించుకుంటున్నాయి. 

2036 నాటికి భారతదేశంలోని నగరాల్లో నివసించే జనాభా 60 కోట్లకు చేరుకుంటుందని ఒక అంచనా. ఈ స్థాయిలో జనాభా పెరుగుదల మంచి అవకాశాలను సృష్టించడంతో పాటు లక్షలాది మంది జనాభాకు అనుగుణంగా పౌర సేవలు విస్తరించడం, పౌరులకు మెరుగైన జీవనానికి అనువైన పరిస్థితులను కల్పించడం ప్రభుత్వానికి ఒక సవాలు కానుంది. అందువల్ల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పట్టణ మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడానికి మనం గణనీయంగా వనరులను కేటాయించాల్సిన అవసరం ఉంది.  

ఈ అవసరాన్ని గుర్తించిన భారత జీ20 అధ్యక్షత ‘ఫైనాన్సింగ్‌ సిటీస్‌ టుమారో: సస్టెయినబుల్, ఇంక్లూజివ్‌ అండ్‌ రజిలెంట్‌’ అనే థీమ్‌ను ఎంపిక చేసుకుంది. అందుకనుగుణంగా నగరాల్లో స్థిరమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడానికి న్యూఢిల్లీ లీడర్స్‌ డిక్లరేషన్‌ పేరుతో ‘ఫైనాన్సింగ్‌ సిటీస్‌ ఆఫ్‌ టుమారో’ ఆవిర్భావానికి కొన్ని సూత్రాలను ఆమోదించారు. 

పట్టణ మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడంలో ప్రభు త్వాలకున్న పరిమితుల దృష్ట్యా ప్రైవేటు పెట్టుబడులను సమీకరించడం నేడు అనివార్యంగా మారింది. ఇందుకనుగుణంగా స్థిరమైన, సమ్మిళిత మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చు కోవడానికి నగరాలకు మార్గనిర్దేశం చేసే విధంగా భారత్‌ అధ్యక్షతన జరిగిన జీ20 కొన్ని నివేదికలను ప్రకటించింది.

ఈ వ్యూహంలో పట్టణ ప్రణాళిక సంస్కరణలు, సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం, పెట్టు బడి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, నగరాల రుణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం, గ్రీన్, సోషల్‌ మరియు సస్టెయినబుల్‌ బాండ్లు వంటి వినూత్న ఫైనాన్సింగ్‌ సాధనాలను ఉపయోగించుకుని స్థిరమైన పెట్టుబడి ప్రాజెక్టులను నిర్విరామంగా సాధించడం, నియంత్రణా వాతావరణాన్ని అందుబాటులో ఉంచడం, ఏఐ, సామర్థ్యాల పెంపు, సంస్థాగత సంసిద్ధత వంటి సాధనాలను ఉపయోగించు కోవడం వంటివి ప్రధానాంశాలుగా ఉన్నాయి. 

భారతదేశంలోని అనేక నగరాలు వినూత్న ఆదాయ వనరుల సృష్టి, పెట్టుబడి అవకాశాలు సుసాధ్యమని నిరూపించాయి. మధ్య ప్రదేశ్‌లోని రేవా మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఎంసీ) మౌలిక సదు పాయాల కోసం సగటున ఏటా రూ. 350 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో కేవలం 34 శాతం మాత్రమే మున్సిపాలిటీ సొంత ఆదాయ వనరుల నుండి వస్తుంటే, మిగిలినది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ పథకాలు మరియు గ్రాంట్ల ద్వారా సమకూరుతోంది.

మౌలిక వసతులకు సొంత ఆదాయం నుండి ఇంత తక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నప్పటికీ, పట్టణ భూభాగపు రీ–డెన్సిఫికేషన్‌ ఆధారంగా వ్యూహ్మాత్మక పట్టణ ప్రణాళికతో న్యూ రేవా బస్‌ స్టాండ్‌ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) విధానం ద్వారా విజయవంతంగా అమలు చేసింది. న్యూ రేవా బస్‌ స్టాండ్‌ ప్రాజెక్టులో 3.5 ఎకరాల ఖాళీ ప్రదేశాన్ని వాణిజ్య సము దాయంతో కూడిన బస్‌ స్టాండ్‌గా తీర్చిదిద్దడం ద్వారా, మున్సిపా లిటీకి రూ. 10.5 కోట్ల ప్రీమియంతో పాటు, ఏడాదికి రూ. 35 లక్షల అద్దె లభిస్తోంది. 

భారతదేశంలోని ఇతర నగరాలు కూడా పట్టణ మౌలిక సదు పాయాలను అభివృద్ధి చేసుకోవడానికి వినూత్న ఆదాయ నమూనా లను విజయవంతంగా వినియోగించుకుంటున్నాయి. గ్రేటర్‌ విశాఖ పట్నం మున్సిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) వ్యర్థ జలాలను శుద్ధి చేసి ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యంతో పరిశ్రమల వినియోగానికి నీటిని సరఫరా చేయడం ద్వారా ఏటా సుమారు రూ. 30 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

ప్రాజెక్టు నిధుల కోసం జీవీఎంసీ పన్నుల వసూళ్లు, సేవా పంపిణీ ప్రమాణాలను స్థిరంగా ప్రదర్శించడం ద్వారా రుణ అర్హతలను మెరుగుపరుచుకుని ‘ఏఏ’ క్రెడిట్‌ రేటింగ్‌ను సాధించింది. అదే విధంగా సూరత్‌ నగరం కూడా పారిశ్రామిక పునర్వి నియోగం కోసం శుద్ధి చేసిన వ్యర్థ నీటిని విక్రయించడం ద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.140 కోట్ల కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంది. 

స్థిరమైన ఆర్థిక వనరుల సేకరణలో పేరుగాంచిన ఘజియాబాద్‌ భారతదేశంలో రూ. 150 కోట్ల మున్సిపల్‌ గ్రీన్‌ బాండ్లను విడుదల చేసిన మొదటి యూఎల్‌బీ (అర్బన్‌ లోకల్‌ బాడీ)గా నిలిచింది. మెరుగైన పట్టణ ప్రణాళిక, వినూత్న ఆర్థిక నమూనాల ద్వారా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుని తమ పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి చిన్న నగరాలు కూడా ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించ గలవని పైన పేర్కొన్నవి ఉదాహరణగా నిలుస్తున్నాయి. 

జీ20 వెలువరించిన పత్రాలు నాణ్య మైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడానికి మన నగరాలకు మార్గ దర్శకంగా ఉపయోగపడుతుంటే, భారత దేశ అనుభవాలు ప్రపంచ మౌలిక సదు పాయాల ఎజెండాను నిర్దేశించడానికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి. అటల్‌ మిషన్‌ ఫర్‌ రీజువనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ (అమృత్‌), స్మార్ట్‌ సిటీస్‌ మిషన్, హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ (పీఎంఎవై), మెట్రో రైల్‌ ప్రాజెక్టులు, ట్రాన్సిట్‌ ఓరియెంటెడ్‌ డెవలప్‌మెంట్, స్మార్ట్‌ సిటీ మిషన్ లో ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ అండ్‌ కమాండ్‌ సెంటర్లు, వివిధ నగరాలు జారీ చేసిన మునిసిపల్‌ బాండ్లు, 2018లో రూపొందించిన భారతదేశ నేషనల్‌ అర్బన్‌ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌యూపీఎఫ్‌) అమలు నుండి నేర్చుకున్న పాఠాలు... గ్రూపు ఆలోచనలను సుసంపన్నం చేశాయి. అలాగే వాటిని పరస్పరం పంచుకోవడం వివిధ దశలలో అభివృద్ధిలో ఉన్న నగరాల ఆకాంక్షలకు అనుగుణంగా సుస్థిర ఆర్థిక వనరుల సమీకరణకు ఇతర మార్గాలను ఉపయోగించుకునేందుకు మార్గదర్శకంగా నిలిచాయి.   

సుస్థిర ఆర్థిక వనరుల సమీకరణకు ఇతర మార్గాలను ఉపయోగించుకునే దిశగా ముందుకు వెళ్లడానికి భారతీయ నగరాలు తమ సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, డిజిటైజ్డ్‌ అకౌంటింగ్‌ వ్యవస్థను అవలంబించడం, పెట్టుబడి పెట్టదగిన ప్రాజెక్టుల పైప్‌ లైన్‌ను కలిగి ఉండటం, వాటి విశ్వసనీయత, ఆదాయ సేకరణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం అత్యవసరం. పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వైపు ప్రైవేట్‌ మూలధనాన్ని ఆకర్షించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఈ పరివర్తన కీలకం.
సోలమన్‌ ఆరోక్యరాజ్‌ 
వ్యాసకర్త జాయింట్‌ సెక్రటరీ, కేంద్ర ఆర్థిక శాఖ, భారత ప్రభుత్వం
(వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

మరిన్ని వార్తలు