ధరల తీరుపై కేంద్రం, ఆర్‌బీఐ హై అలర్ట్‌

22 Nov, 2023 07:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎకానమీపై ద్రవ్యోల్బణం ప్రభావం ఇంకా తీవ్రంగానే  ఉందని, ధరల కట్టడి విషయంలో కేంద్రం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) హై అలర్ట్‌లో ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన అక్టోబర్‌ నెలవారీ ఆర్థిక నివేదిక పేర్కొంది.  అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టడం, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణంలో నియంత్రణ కొనసాగడం వంటి అంశాల నేపథ్యంలో ధరల ఒత్తిడిని అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ద్రవ్యోల్బణం కట్టడికి అవసరమైతే ఆర్‌బీఐ రేటు మరింత కఠినతరం చేస్తుందనీ ఆర్థికశాఖ నివేదిక అభిప్రాయపడింది. నివేదికలో మరికొన్ని అంశాలను పరిశీలిస్తే.. 

భారత్‌ ముడి చమురు బాస్కెట్‌ ధర నవంబర్‌లో ఇప్పటివరకు బ్యారెల్‌కు సగటున 83.93 డాలర్లుగా ఉంది.  అక్టోబర్‌లో బ్యారెల్‌ 90.08 డాలర్లతో పోల్చితే ఇది  పోలిస్తే, ప్రభుత్వ డేటా చూపిస్తుంది. 

ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా ఫలితంగా, ‘ఎంపిక’ చేసిన కొన్ని కీలక ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 53.6 శాతానికి తగ్గింది. జూలైలో ఈ రేటు 60.6 శాతం. కూరగాయల ధరల తీవ్రతా తగ్గింది. ఇక ఆర్‌బీఐ తీసుకుంటున్న ద్రవ్య పరమైన చర్యలు ఒకవైపు ద్రవ్యోల్బణం కట్టడికి మరోవైపు వృద్ధిక పురోగతికి తోడ్పాటును అందిస్తున్నాయి.  

రూపాయి విలువ, పేమెంట్ల సమతౌల్యతలపై ప్రభావం చూపే విదేశీ మారకద్రవ్య ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించడం జరుగుతోంది.  

అక్టోబర్‌లో వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) ఆల్‌టైమ్‌ గరిష్టం 31.46 బిలియన్‌ డాలర్లకు చేరినప్పటికీ, కరెంట్‌ అకౌంట్‌లోటు కట్టడిలోనే ఉంది. ఇప్పటికి దీనిపై ఆందోళన పడాల్సింది ఏదీ లేదు.  

ఆర్‌బీఐ ద్రవ్య, పరపతి చర్యలు పూర్తిగా వ్యవస్థలోకి బదలాయింపులు జరిగితే, డిమాండ్‌ కొంత మందగించే వీలుంది.  

సవాళ్లు ఉన్పప్పటికీ, భారత్‌ ఎకానమీ 2023–24లో సానుకూల బాటలోనే కొనసాగుతుంది. మౌలిక, డిజిటల్‌ రంగాలపై జరుగుతున్న పెట్టుబడులు వృద్ధికి ఊతమిస్తున్నాయి.  

అంతర్జాతీయ మందగమన పరిస్థితుల్లోనూ భా రత్‌ ఎకానమీ గణనీయమైన పురోగతిని సా ధిస్తోంది. దేశీయ పటిష్ట డిమాండ్‌ దీనికి కారణం  

4 శాతం లక్ష్యం... 
ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్‌ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్‌ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్‌బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో గత నాలుగు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్‌బీఐ పెద్దపీట వేసింది.

జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్‌ ద్రవ్యోల్బణం, అక్టోబర్‌ నాటికి నాలుగు నెలల కనిష్ట స్థాయి 4.87 శాతానికి దిగివచ్చింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 ప్లస్‌ లేదా మైనస్‌తో 4 శాతం వద్ద (మినహాయింపులకు లోబడి ఎగవముఖంగా 6 శాతం) ఉండాలన్నది సెంట్రల్‌ బ్యాంక్‌కు కేంద్రం నిర్దేశం. సెప్టెంబర్, అక్టోబర్‌లలో ఆర్‌బీఐకి నిర్దేశిత పరిధిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, తమ లక్ష్యం 4 శాతమేనని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. 2022–2023 ఆర్థిక సంవత్సరంలో సగటు రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.7 శాతంకాగా, 2023–24లో రేటు 5.4 శాతానికి తగ్గుతుందన్నది ఆర్‌బీఐ అంచనా. 

క్యూ2లో వృద్ధి 7 శాతం లోపే... 
నవంబర్‌ 30వ తేదీన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక (జూలై–సెప్టెంబర్‌) జీడీపీ గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో పలువురు దీనిపై తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 7 శాతం వరకూ ఉంటుందని పలు రేటింగ్, విశ్లేషణా సంస్థల అంచనా. 7 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తుండగా, 6.8 శాతంగా బ్రిటిష్‌ బ్రోకరేజ్‌ బార్‌క్లేస్‌ భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 7.8 శాతం కన్నా తాజా అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. 2023–24లో వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనావేస్తోంది.

మరిన్ని వార్తలు