Dr Ranjan Pai: నాడు అద్దె ఇల్లు.. నేడు 6 యూనివర్సిటీలు, 28 ఆస్పత్రులు

15 Oct, 2023 17:23 IST|Sakshi

ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ న్యూయార్క్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ డేవిడ్‌సన్ కెంప్‌నర్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్‌తో కొనసాగుతున్న రుణ వివాదానికి పరిష్కారం అంచున ఉంది. మణిపాల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ మెడికల్‌ గ్రూప్‌ చైర్మన్‌ రంజన్‌ పాయ్‌ బైజూస్‌లో దాదాపు రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.  ఈ ఏడాది ప్రారంభంలో డేవిడ్‌సన్ కెంప్‌నర్ నుంచి బైజూస్ తీసుకున్న రూ.800 కోట్ల రుణాన్ని సెటిల్ చేసేందుకు రంజన్ పాయ్ రూ.1,400 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. ఈ  నేపథ్యంలో ఎవరీ డాక్టర్‌ రంజన్‌ పాయ్‌.. ఆయన బిజినెస్‌.. నెట్‌వర్త్‌ వంటి విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎవరీ డాక్టర్‌ రంజన్‌ పాయ్‌?
1972 నవంబర్ 11న జన్మించిన డాక్టర్ రంజన్ పాయ్ ఒక అర్హత కలిగిన వైద్యుడు, వ్యాపారవేత్త. మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ (MEMG) ఛైర్మన్. ఈ గ్రూప్‌ ప్రపంచవ్యాప్తంగా ఆరు విశ్వవిద్యాలయాలు, 28 ఆసుపత్రులను నడుపుతోంది. రంజన్ పాయ్ తండ్రి పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాందాస్ పాయ్. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE)కి రాందాస్ పాయ్ ఛాన్సలర్‌గా ఉన్నారు. రంజన్ పాయ్ మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసి, యూఎస్‌ వెళ్లి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఫెలోషిప్ పూర్తి చేశారు.

అద్దె ఇంట్లో ప్రారంభం
డాక్టర్ రంజన్ పాయ్ మలేషియాలోని మెలక మణిపాల్ మెడికల్ కాలేజీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 2000 సంవత్సరంలో రంజన్ పాయ్ బెంగళూరులోని అద్దె ఇంట్లో మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్‌ను ప్రారంభించారు.  కేవలం 2 లక్షల డాలర్లతో వ్యాపారాన్ని మొదలు పెట్టారు.  ఇప్పుడు దీని విలువ సుమారు 3 బిలియన్‌ డాలర్లు ( దాదాపు రూ. 25,000 కోట్లు).

నెట్‌వర్త్‌
ఫోర్బ్స్ ప్రకారం డాక్టర్ రంజన్ పాయ్ నెట్‌వర్త్‌ 2.8 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 23,000 కోట్లు). మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్‌కు ఇప్పుడు మలేషియా, ఆంటిగ్వా, దుబాయ్, నేపాల్‌ దేశాల్లో  కూడా క్యాంపస్‌లు ఉన్నాయి.  ఇదే కాకుండా డాక్టర్‌ రంజేన్‌ పాయ్‌కి మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ అనే సంస్థ కూడా ఉంది.

మరిన్ని వార్తలు