‘షమీ’ఫైనల్‌ వండర్‌

16 Nov, 2023 03:21 IST|Sakshi

ప్రపంచకప్‌ తుదిపోరుకు టీమిండియా

సెమీఫైనల్లో 70 పరుగులతో న్యూజిలాండ్‌పై విజయం

7 వికెట్లతో మెరిసిన షమీ

కోహ్లి, అయ్యర్‌ సెంచరీలు

మిచెల్‌ శతకం వృథా

పోరాడి ఓడిన కివీస్‌ బృందం  

కింగ్‌ 50

వన్డేల్లో కోహ్లి 50వ సెంచరీ

సచిన్‌ను అధిగమించి కొత్త రికార్డు 

భారత్‌ అప్రతిహత జైత్రయాత్రలో మరో అడుగు విజయవంతంగా పడింది... 1983, 2003, 2011... ఈ క్యాలెండర్‌లలో ఇప్పుడు 2023 చేరింది... అభిమానుల కలలను నిజం చేసే అంచనాలను నిలబెట్టే ప్రయత్నంలో టీమిండియా మరోసారి తుది పోరుకు అర్హత సాధించింది. లీగ్‌ దశలో ఒక్క ఓటమీ లేకుండా ముగించిన టీమిండియా నాకౌట్‌ పోరులోనూ తమ స్థాయిని నిలబెట్టుకుంది... ఆసక్తకిరంగా, అక్కడక్కడా పోటాపోటీగా సాగిన సమరంలో న్యూజిలాండ్‌పై విజయం సాధించి సగర్వంగా నిలిచింది. గత వరల్డ్‌ కప్‌లో ఇదే కివీస్‌ చేతిలో ఇదే సెమీస్‌ మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి నాలుగేళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకొని పాత గాయానికి మందు వేసింది. కోహ్లి, అయ్యర్, షమీ ఈ గెలుపులో హీరోలుగా నిలిచారు. 

397 పరుగులు... ఇంత భారీ స్కోరు చేసిన తర్వాత కూడా భారత జట్టు ఒకదశలో  ఆందోళనకు లోనైంది... ఆటగాళ్లలో నాకౌట్‌ మ్యాచ్‌ ఒత్తిడి కనిపించి తప్పులు చేయడం మొదలైంది... అభిమానుల్లో కాస్త ఉత్కంఠ, మరి కాస్త ఆందోళన... పోరాటానికి  మారుపేరైన కివీస్‌ తగ్గలేదు... 32 ఓవర్ల తర్వాత చూస్తే కివీస్‌ స్కోరు 219/2... అంతకుముందు ఈ స్థితిలో భారత్‌ 226/1... పెద్ద తేడా ఏమీ లేదు. తర్వాతి  ఓవర్లలో చెలరేగేందుకు బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారు. అప్పుడొచ్చాడు షమీ... ఒకే ఓవర్లో రెండు వికెట్లతో కివీస్‌ వెన్ను వెరిచి మళ్లీ కోలుకోలేకుండా చేశాడు. చివరి వరకు అదే జోరును కొనసాగించి భారత్‌ తరఫున అత్యుత్తమ వన్డే గణాంకాలతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు.   

ముంబై: వన్డే వరల్డ్‌ కప్‌ చరిత్రలో నాలుగోసారి భారత్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గత రెండు టోర్నీల్లో సెమీఫైనల్‌కు పరిమితమైన టీమిండియా ఈసారి మరో అడుగు ముందుకేసి ట్రోఫీపై గురి పెట్టింది. బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్‌ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది.

విరాట్‌ కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగగా... శుబ్‌మన్‌ గిల్‌ (66 బంతుల్లో 80 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కోహ్లి, అయ్యర్‌ 21.2 ఓవర్లలోనే 163 పరుగులు జత చేయడం విశేషం. అనంతరం న్యూజిలాండ్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది.

డరైల్‌ మిచెల్‌ (119 బంతుల్లో 134; 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, కేన్‌ విలియమ్సన్‌ (73 బంతుల్లో 69; 8 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మొహమ్మద్‌ షమీ (7/57) కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనతో కివీస్‌ను దెబ్బ కొట్టాడు. నేడు ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య కోల్‌కతాలో జరిగే రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ విజేతతో ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో భారత్‌ తలపడుతుంది.  

ఒకరితో మరొకరు పోటీ పడి... 
ఎప్పటిలాగే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) తనదైన శైలిలో ఇన్నింగ్స్‌ను దూకుడుగా మొదలు పెట్టాడు. కివీస్‌ ప్రధాన పేసర్లపై తన జోరును ప్రదర్శించిన అతను చక్కటి షాట్లతో దూసుకుపోయాడు. తనను ఇబ్బంది పెట్టగలడని భావించిన లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లోనే రోహిత్‌ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. గిల్‌ కూడా అండగా నిలవడంతో తొలి 8 ఓవర్లలోనే భారత్‌ 70 పరుగులు చేసింది.

అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్‌ను తర్వాతి ఓవర్లోనే సౌతీ అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం గిల్‌ తన ధాటిని పెంచాడు. ఫెర్గూసన్‌ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్‌ కొట్టిన అతను 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత కండరాలు పట్టేయడంతో గిల్‌ పెవిలియన్‌కు వెళ్లిపోగా, అతని స్థానంలో వచ్చిన అయ్యర్‌ మెరుపు బ్యాటింగ్‌తో కివీస్‌ పని పట్టాడు.

29వ ఓవర్‌ తొలి బంతికి భారత్‌ స్కోరు 200 పరుగులు దాటింది. తన సొంత మైదానంలో సిక్సర్లతో చెలరేగిన అయ్యర్‌ను నిలువరించడం ప్రత్యర్థి బౌలర్ల వల్ల కాలేదు. బౌల్ట్‌ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను 35 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. 40వ ఓవర్‌ ముగిసేసరికి స్కోరు 287/1. చివరి 10 ఓవర్లలో టీమిండియా మరింతగా చెలరేగిపోయింది. రచిన్‌ బౌలింగ్‌లోనే మూడు సిక్సర్లతో అయ్యర్‌ సత్తా చాటాడు.

సౌతీ ఓవర్లో భారీ సిక్స్‌ బాదిన అయ్యర్‌ తర్వాతి బంతికి సింగిల్‌ తీసి 67 బంతుల్లోనే వరుసగా రెండో శతకం నమోదు చేశాడు. వీరందరికి తోడు కేఎల్‌ రాహుల్‌ (20 బంతుల్లో 39 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) తన మెరుపులను జోడించడంతో చివరి 2 ఓవర్లలో 31 పరుగులు వచ్చాయి. ఆఖరి 10 ఓవర్లలో భారత్‌ 110 పరుగులు సాధించింది.  

భయపెట్టిన భాగస్వామ్యాలు... 
దాదాపు అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్‌ తడబడింది. 39 పరుగులకే ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయింది. అయితే విలియమ్సన్, మిచెల్‌ కలిసి జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా ఆ తర్వాత వీరిద్దరు భారీ షాట్లతో చెలరేగిపోయారు. భారత బౌలింగ్‌ కొద్ది సేపు కట్టుతప్పి వైడ్‌లు, బైస్, ఓవర్‌త్రోలు, ఫీల్డింగ్‌ వైఫల్యాలు, రనౌట్‌ అవకాశాలు చేజారడం... ఇవన్నీ కూడా కివీస్‌కు కలిసొచ్చాయి.

ముఖ్యంగా మిచెల్‌ ప్రతీ బౌలర్‌పై చెలరేగి పరుగులు సాధించగా, విలియమ్సన్‌ సరైన రీతిలో సహకరించాడు. వీరిద్దరు క్రీజ్‌లో ఉన్నంత సేపు (24.5 ఓవర్లు) భారత  బృందంలో కాస్త ఒత్తిడి కనిపించింది. ఇదే జోరులో మిచెల్‌ 85 బంతుల్లో టోర్నీలో తన రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్‌కు 181  పరుగుల భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు భారత్‌కు వికెట్‌ దక్కింది.

విలియమ్సన్‌ను అవుట్‌ చేసిన షమీ, అదే ఓవర్లో లాథమ్‌ (0)ను వెనక్కి పంపడంతో కివీస్‌ వెనకడుగు వేసింది. ఆ తర్వాత మిచెల్, ఫిలిప్స్‌ (33 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా 61 బంతుల్లోనే 75 పరుగులు జత చేయడం కూడా మ్యాచ్‌లో కివీస్‌ ఆశలు నిలిపింది. కానీ 44 బంతుల్లో 103 పరుగులు చేయాల్సిన స్థితిలో ఫిలిప్స్‌ అవుట్‌ కావడంతో న్యూజిలాండ్‌  పరాజయం ఖాయమైంది.  

వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌ చేరడం ఇది నాలుగోసారి. గతంలో భారత్‌ 1983 (విజేత), 2003 (రన్నరప్‌), 2011 (విజేత) తుది పోరుకు అర్హత సాధించింది.  

ఒకే ప్రపంచకప్‌లో మ్యాచ్‌లో 5 లేదా  అంతకంటే ఎక్కువ వికెట్లు  మూడుసార్లు తీసిన తొలి బౌలర్‌గా షమీ గుర్తింపు  పొందాడు. గతంలో గ్యారీ గిల్మోర్‌ (ఇంగ్లండ్‌; 1975లో), అషంత డి మెల్‌ (శ్రీలంక; 1983లో), వాస్‌బెర్ట్‌ డ్రేక్స్‌ (వెస్టిండీస్‌; 2003లో), షాహిద్‌ అఫ్రిది (పాకిస్తాన్‌; 2011లో), ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌ (బంగ్లాదేశ్‌; 2019లో), మిచెల్‌ స్టార్క్‌  (ఆ్రస్టేలియా; 2019లో) రెండుసార్లు చొప్పున ఈ ఘనత సాధించారు. 

51 ప్రపంచకప్‌ టోర్నీ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ అవతరించాడు. రోహిత్‌ ఇప్పటి వరకు 51 సిక్స్‌లు కొట్టాడు. 49 సిక్స్‌లతో క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌) పేరిట ఉన్న రికార్డును రోహిత్‌ సవరించాడు. అంతేకాకుండా ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గానూ రోహిత్‌ గుర్తింపు పొందాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌ 28 సిక్స్‌లు కొట్టాడు. క్రిస్‌ గేల్‌ (2015లో 26 సిక్స్‌లు) పేరిట ఉన్న రికార్డును రోహిత్‌ బద్దలు కొట్టాడు. 

వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా షమీ (7/57) గుర్తింపు  పొందాడు. ఈ జాబితాలో మెక్‌గ్రాత్‌ (ఆ్రస్టేలియా; 7/15 నమీబియాపై 2003లో),  బికెల్‌ (ఆస్ట్రేలియా; 7/20 ఇంగ్లండ్‌పై 2003లో), టిమ్‌ సౌతీ (న్యూజిలాండ్‌; 7/33 ఇంగ్లండ్‌పై 2015లో), విన్‌స్టన్‌ డేవిస్‌ (వెస్టిండీస్‌; 7/51 ఆ్రస్టేలియాపై 1983లో) ఉన్నారు.  

1 వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. స్టువర్ట్‌ బిన్నీ (4 పరుగులకు 6 వికెట్లు; 2014లో బంగ్లాదేశ్‌పై ) పేరిట ఉన్న రికార్డును షమీ అధిగమించాడు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షమీ (23 వికెట్లు) అవతరించాడు. జహీర్‌ ఖాన్‌ (21 వికెట్లు 2003లో) పేరిట ఉన్న రికార్డును షమీ సవరించాడు.  


397 ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్‌ నిలిచింది. 2015 ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్లో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్‌ 6 వికెట్లకు 393 పరుగులు చేసింది.  

‘వచ్చే కొద్ది రోజుల్లోనే నా రికార్డును బద్దలు కొడతావని ఆశిస్తున్నా’... కోహ్లి 49వ సెంచరీ తర్వాత సచిన్‌ టెండూల్కర్‌ చెప్పిన మాట ఇది. దిగ్గజ క్రికెటర్‌ ఆశీర్వాదం వాస్తవంగా మారేందుకు ఎక్కువ రోజులు పట్టలేదు. సరిగ్గా పది రోజులకే 49 నుంచి 50కి చేరుకొని విరాట్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. సచిన్‌ ఎదురుగా... సచిన్‌ సొంత మైదానంలో... సచిన్‌ తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ బరిలోకి దిగిన తేదీన... సచిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఖరి సారిగా బ్యాటింగ్‌ చేసిన తేదీన... ప్రపంచ కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో సచిన్‌ రికార్డును అధిగమించి వన్డే క్రికెట్‌లో అత్యధిక శతకాలతో శిఖరాన నిలిచాడు.

దక్షిణాఫ్రికాపై సెంచరీ సాధించిన తర్వాత కోహ్లి ఫామ్‌ చూస్తే మిగిలిన వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లలో ఈ మైలురాయిని అందుకోవడం లాంఛనమే అనిపించింది. బుధవారం తన స్థాయికి తగ్గ ఆటతో తనదైన శైలిలో కోహ్లి దానిని చేసి చూపించాడు. 9, 1, 1... గత మూడు వరుస ప్రపంచకప్‌ (2011, 2015, 2019) సెమీఫైనల్స్‌లో కోహ్లి స్కోర్లు ఇవి. ఇలాంటి నేపథ్యంలో బరిలోకి దిగిన తర్వాత ‘సున్నా’ వద్ద ఎల్బీడబ్ల్యూ కోసం కివీస్‌ అప్పీల్, ఆపై రివ్యూ కోరడం కొద్దిసేపు అభిమానుల గుండె ఆగిపోయేలా చేసింది. ఆ తర్వాత అతని ఇన్నింగ్స్‌ జాగ్రత్తగా సాగింది. తొలి 40 బంతుల్లో అతను రెండే ఫోర్లతో 30 పరుగులు చేశాడు.

ఆ తర్వాత మరో రెండు ఫోర్లతో 59 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌతీ బౌలింగ్‌లో చూడచక్కటి  సిక్సర్‌ కొట్టాక ఫిలిప్స్‌ ఓవర్లో తీసిన సింగిల్‌తో వరల్డ్‌ కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్‌ ఘనతను అధిగమించాడు. 91 వద్ద సింగిల్‌ తీశాక కండరాలు పట్టేయడంతో ఫిజియోతో స్వల్ప చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. భారత్‌ ఇన్నింగ్స్‌ 42వ ఓవర్‌ నాలుగో బంతికి కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో డీప్‌ మిడ్‌ వికెట్‌ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 50వ వన్డే సెంచరీ విరాట్‌ ఖాతాలో చేరింది. దాంతో వాంఖెడే మొత్తం హోరెత్తిపోయింది.

49వ శతకం సమయంలో ఎలాంటి భావోద్వేగాలు చూపించకుండా ప్రశాంతత కనబర్చిన కోహ్లి ఇక్కడ మాత్రం నియంత్రించుకోలేకపోయాడు. గాల్లోకి ఎగిరి జంప్‌ చేయడంతో పాటు తన భార్య అనుష్క వైపు చూస్తూ ఫ్లయింగ్‌ కిస్‌లు పంపిన కింగ్‌... సచిన్‌ను చూస్తూ తలవంచి అభివాదంతో తన గౌరవాన్ని ప్రదర్శించాడు. మరో ఏడు బంతుల తర్వాత ఈ అద్భుత ఇన్నింగ్స్‌ ముగియగా, మైదానంలో ప్రేక్షకుల అభినందనల మధ్య అతను పెవిలియన్‌ చేరాడు. మొదటి 49 సెంచరీలు ఒక ఎత్తు... ఈ శతకం మరో ఎత్తు అన్నట్లుగా విరాట్‌ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచిపోయింది.  

711 ఈ ప్రపంచకప్‌లో కోహ్లి చేసిన మొత్తం పరుగులు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా 20 ఏళ్లుగా సచిన్‌ పేరిట ఉన్న రికార్డును కోహ్లి బద్దలు కొట్టి కొత్త రికార్డు నెలకొల్పాడు. 2003 ప్రపంచకప్‌లో సచిన్‌ టెండూల్కర్‌ 673 పరుగులు సాధించాడు. 

24 భారత్‌లో కోహ్లి చేసిన సెంచరీలు. ఒకే దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌ కోహ్లినే. ఈ జాబితాలో సచిన్‌ 20 సెంచరీలు  (భారత్‌లో), పాంటింగ్‌ (ఆ్రస్టేలియా), ఆమ్లా (దక్షిణాఫ్రికా) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా షమీ (7/57) గుర్తింపు  పొందాడు. ఈ జాబితాలో మెక్‌గ్రాత్‌ (ఆ్రస్టేలియా; 7/15 నమీబియాపై 2003లో),  బికెల్‌ (ఆస్ట్రేలియా; 7/20 ఇంగ్లండ్‌పై 2003లో), టిమ్‌ సౌతీ (న్యూజిలాండ్‌; 7/33 ఇంగ్లండ్‌పై 2015లో), విన్‌స్టన్‌ డేవిస్‌ (వెస్టిండీస్‌; 7/51 ఆ్రస్టేలియాపై 1983లో) ఉన్నారు.  

వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. స్టువర్ట్‌ బిన్నీ (4 పరుగులకు 6 వికెట్లు; 2014లో బంగ్లాదేశ్‌పై ) పేరిట ఉన్న రికార్డును షమీ అధిగమించాడు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షమీ (23 వికెట్లు) అవతరించాడు. జహీర్‌ ఖాన్‌ (21 వికెట్లు 2003లో) పేరిట ఉన్న రికార్డును షమీ సవరించాడు.  

నా మనసులో ఎలాంటి భావాలు ఉన్నాయో చెప్పలేకపోతున్నా. అంతా ఒక కలలా ఉంది. ఇదంతా నిజమేనా అనిపిస్తోంది. సెమీఫైనల్‌లో ఇలా చేయగలనని ఎప్పుడూ అనుకోలేదు. నా హీరో సచిన్, నా జీవిత భాగస్వామి అంతా అక్కడ కూర్చున్నారు. ఇక అభిమానులంతా తోడుగా నిలిచారు. ఇంకా వివరంగా చెప్పలేకపోతున్నా కానీ నేను ఒక చిత్రాన్ని గీసే అవకాశం ఉంటే అది ఇదే చిత్రం కావాలని కోరుకుంటా.         –విరాట్‌ కోహ్లి  

విలియమ్సన్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వదిలేసినప్పుడు చాలా బాధపడ్డా. అయితే బౌలింగ్‌తోనే వారిని పడగొట్టాలని భావించా. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భిన్నంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఈ ప్రదర్శనతో చాలా గొప్పగా అనిపిస్తోంది. గత రెండు టోర్నీల్లో సెమీస్‌ ఓడాం. ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఈ అవకాశం చేజార్చుకోరాదని కోరుకుంటున్నాం.   -షమీ      

ఈ మైదానంలో ఎంత స్కోరు చేసినా సరిపోదని నాకు బాగా తెలుసు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టడం ముఖ్యం. ఫీల్డింగ్‌లో కాస్త ఇబ్బంది పడ్డాం. సెమీస్‌ అంటే సహజంగానే అదనపు ఒత్తిడి ఉంటుంది. కానీ ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. మరో 30–40 పరుగులు తక్కువగా చేస్తే ఎలా ఉండేదో చెప్పలేను. ఎందుకంటే వారూ జాగ్రత్తగానే ఆడేవారేమో. షమీ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. టాప్‌–6 బ్యాటర్లంతా తమ పాత్రకు న్యాయం చేస్తున్నారు. చివరకు అన్నీ మాకు అనుకూలించాయి.  –రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్‌   

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) విలియమ్సన్‌ (బి) సౌతీ 47; గిల్‌ (నాటౌట్‌) 80; కోహ్లి (సి) కాన్వే (బి) సౌతీ 117; అయ్యర్‌ (సి) మిచెల్‌ (బి) బౌల్ట్‌ 105; రాహుల్‌ (నాటౌట్‌) 39; సూర్యకుమార్‌ (సి) ఫిలిప్స్‌ (బి) సౌతీ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 397. వికెట్ల పతనం: 1–71, 2–164, 3–381, 4–382. బౌలింగ్‌: బౌల్ట్‌ 10–0–86–1, సౌతీ 10–0–100–3, సాన్‌ట్నర్‌ 10–1–51–0, ఫెర్గూసన్‌ 8–0–65–0, రచిన్‌ 7–0–60–0, ఫిలిప్స్‌ 5–0–33–0.  

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (సి) రాహుల్‌ (బి) షమీ 13; రచిన్‌ (సి) రాహుల్‌ (బి) షమీ 13; విలియమ్సన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) షమీ 69; మిచెల్‌ (సి) జడేజా (బి) షమీ 134; లాథమ్‌ (ఎల్బీ) (బి) షమీ 0; ఫిలిప్స్‌ (సి) జడేజా (బి) బుమ్రా 41; చాప్‌మన్‌ (సి) జడేజా (బి) కుల్దీప్‌ 2; సాన్‌ట్నర్‌ (సి) రోహిత్‌ (బి) సిరాజ్‌ 9; సౌతీ (సి) రాహుల్‌ (బి) షమీ 9; బౌల్ట్‌ (నాటౌట్‌) 2; ఫెర్గూసన్‌ (సి) రాహుల్‌ (బి) షమీ 6; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్‌) 327. వికెట్ల పతనం: 1–30, 2–39, 3–220, 4–220, 5–295, 6–298, 7–306, 8–319, 9–321, 10–327. బౌలింగ్‌: బుమ్రా 10–1–64–1, సిరాజ్‌ 9–0–78–1, షమీ 9.5–0–57–7, జడేజా 10–0–63–0, కుల్దీప్‌ 10–0–56–1.  

మరిన్ని వార్తలు