Aparna Chennapragada: మైక్రోసాఫ్ట్ సీవీపీగా భారతీయ మహిళ.. కీలక విభాగం పగ్గాలు ఆమెకే!

12 Oct, 2023 14:14 IST|Sakshi

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా భారతీయ అమెరికన్‌ మహిళ అపర్ణ చెన్నప్రగడ (Aparna Chennapragada) నియమితులయ్యారు. టెక్ పరిశ్రమలో విశేష అనుభవమున్న ఆమెకు కీలకమైన ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌ విభాగం బాధ్యతలు అప్పగించారు. 

ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ అయిన అపర్ణకు ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, డిజైన్‌, స్ట్రాటజీ విభాగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవముంది. గూగుల్‌లో సుమారు 12 ఏళ్లు పనిచేశారు. స్టాక్ ట్రేడింగ్ యాప్ రాబిన్‌హుడ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగారు. తాజాగా మైక్రోసాఫ్ట్‌లో కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా చేరిన ఆమె మైక్రోసాఫ్ట్ 365, మైక్రోసాఫ్ట్ డిజైనర్‌లో జెనరేటివ్‌ ఏఐ ప్రయత్నాలకు నాయకత్వం వహించనున్నారు.

(TCS Headcount Drops: టీసీఎస్‌లో తగ్గిపోయిన ఉద్యోగులు! కారణం ఇదే..) 

లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అపర్ణ చెన్నప్రగడ ఐఐటీ మద్రాస్‌ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో టీటెక్ చేశారు. టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డబుల్ మాస్టర్స్ డిగ్రీని, మిట్‌ నుంచి మేనేజ్‌మెంట్ అండ్‌ ఇంజనీరింగ్‌లో డబుల్ మాస్టర్స్ డిగ్రీని పొందారు. ప్రముఖ ఈబే (eBay) సంస్థలో కన్స్యూమర్ షాపింగ్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, ఏఆర్‌, విజువల్ సెర్చ్ ప్రోడక్ట్‌లకు లీడ్‌గా, బోర్డు మెంబర్‌గా కూడా అపర్ణ పనిచేశారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గూగుల్, మైక్రోసాఫ్ట్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ అపర్ణకు కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా యూఎస్ చెందిన బిజినెస్‌ పబ్లికేషన్‌ ‘ఇన్ఫర్మేషన్’ నివేదించింది.

అపర్ణ నియామకానికి ముందు మరో భారతీయ-అమెరికన్ రోహిణి శ్రీవత్స సెప్టెంబర్‌లో మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియాలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. పునీత్ చందోక్ ఆగస్టులో భారతదేశం, దక్షిణాసియాకు మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

మరిన్ని వార్తలు