కనిపించిన కాగితం మీదల్లా బొమ్మలు గీసేస్తాడు..అదే ఆ బాలుడిని..

12 Nov, 2023 12:31 IST|Sakshi

క్లాసులో ఒకవైపు టీచర్‌ పాఠాలు చెబుతున్నా, మరోవైపు దొరికిన కాగితాల మీదో, నోట్‌ పుస్తకాల మీదో బొమ్మలు గీసే అలవాటు చాలామంది పిల్లలకు ఉంటుంది. పాఠం వినకుండా బొమ్మలు గీయడంలో మునిగిపోయే విద్యార్థులను టీచర్లు మందలించడమూ మామూలే! ఇంగ్లండ్‌లోని ష్రూజ్‌బరీకి చెందిన జో వేల్‌ అనే ఈ పదమూడేళ్ల బాలుడికి ఖాళీగా కనిపించిన కాగితం మీదనల్లా బొమ్మలు గీసే అలవాటు ఉంది. క్లాసులో టీచర్‌ మందలించినా బొమ్మలు గీయకుండా ఉండలేకపోయేవాడు. మిగిలిన క్లాసుల్లో టీచర్ల మందలింపులు తప్పకపోయినా, డ్రాయింగ్‌ క్లాసులో జో వేల్‌ చురుగ్గా ఉండేవాడు.

డ్రాయింగ్‌ టీచర్‌ ప్రోత్సాహంతో తోటి పిల్లలకు ఫ్రీహ్యాండ్‌ డ్రాయింగ్‌ గురించి లెక్చర్లిచ్చేవాడు. అతడి అభిరుచిని గమనించి తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో సోషల్‌ మీడియాలోకి ప్రవేశించాడు. ‘డూడుల్‌ బాయ్‌’ పేరుతో జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు గీసే అలవాటే జో వేల్‌కు చక్కని అవకాశం తెచ్చిపెట్టింది. ‘నైకీ’ షూ కంపెనీకి జో వేల్‌ గీసే బొమ్మలు బాగా నచ్చాయి. ఈ బొమ్మలను తమ షూస్‌పై డిజైన్లుగా ముద్రించుకోవడానికి అతడితో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది.  

(చదవండి: అతిపెద్ద బాలల మ్యూజియం!)

మరిన్ని వార్తలు