పాత రైలు పెట్టెలతో కొత్త వ్యాపారం

7 Feb, 2022 18:35 IST|Sakshi

ఆదాయం పెంచుకునే పనిలో భాగంగా రైల్వేశాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రద్ధీగా ఉండే స్టేషన్లు, రైల్వే స్థలాల్లో సరికొత్త రెస్టారెంట్లు ప్రారంభించనుంది. దీని కోసం పాత రైలు పెట్టెలను ఉపయోగించాలని నిర్ణయించింది. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ నేతృత్వంలో ఈ కార్యక్రమం జోరుగా సాగుతోంది.

వందల ఏళ్లుగా రైల్వేశాఖ దేశంలో సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో సరికొత్త రైలు బోగీలు తయారుచేస్తోంది. ఇదే సమయంలో పాత బోగీలు ప్రయాణానికి పనికిరాకుండా పోతున్నాయి. గత కొంత కాలంగా రైల్వేలో ఫిట్‌నెస్‌ లేని కోచ్‌ల సంఖ్య పెరిగిపోతుంది. యాభై ఏళ్లు పైబడిన రైలు పెట్టెల్లో చాలా వరకు ఫిట్‌నెస్‌తో ఉండటం లేదు. ఇలాంటి పాత పెట్టెలను మేనేజ్‌ చేయడం సైతం రైల్వేకు భారంగా మారుతోంది.

నిరుపయోగంగా మారుతున్న రైలు పెట్టెలతో సరికొత్త వ్యాపారానికి నాంది పలుకుతోంది. ఓల్డ్‌ రైల్వే కాంపార్ట్‌మెంట్లను రెస్టారెంట్లుగా మార్చుతోంది. ఫిట్‌నెస్‌ లేని రైలు పెట్టెలకు రైల్వే ఆధీనంలోని వర్క్‌షాప్‌లలో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇలా మార్చిన రైలు పెట్టెలను రద్ధీగా ఉండే రైల్వే స్టేషన్లలో రెస్టారెంట్లుగా మార్చేస్తోంది. 

ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో ప్రారంభించిన రెస్టారెంట్లకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా భోపాల్‌, జబల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో ఈ తరహా రెస్టారెంట్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో అన్ని ప్రముఖ స్టేషన్లలో అవకాశం ఉన్న చోట ఈ తరహా రెస్టారెంట్‌ ప్రారంభించే దిశగా రైల్వే కసరత్తు చేస్తోంది. 

చదవండి: ఐఆర్‌సీటీసీ ఫీజులో వాటాలపై వెనక్కి తగ్గిన రైల్వేస్‌..

మరిన్ని వార్తలు