పరిశ్రమలు పతనబాటే..!

13 Oct, 2020 04:54 IST|Sakshi

ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి 8 శాతం క్షీణత

మైనస్‌లోనే తయారీ

విద్యుత్, మైనింగ్‌ రంగాలూ నిరాశే!

న్యూఢిల్లీ: కఠిన లాక్‌డౌన్‌ ప్రభావం ఆగస్టులోనూ కొనసాగిందని సోమవారం విడుదలైన అధికారిక పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) గణాంకాలు వెల్లడించాయి. సమీక్షా నెలలో 8 శాతం క్షీణత (2019 ఇదే నెల ఉత్పత్తి విలువతో పోల్చి) నమోదయ్యింది. అయితే కరోనా తీవ్ర ప్రభావంలో ఉన్న  తాజా గణాంకాలను మహమ్మారి వ్యాప్తి ముందు నెలలతో పోల్చి చూడడం తగదని గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. మొత్తం సూచీలో దాదాపు 78 శాతం వరకూ వెయిటేజ్‌ ఉన్న తయారీసహా విద్యుత్, మైనింగ్‌ రంగాలు ఆగస్టులో తీవ్ర నిరాశపరిచాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► తయారీ రంగంలో 8.6 శాతం క్షీణరేటు నమోదయ్యింది.  
► మైనింగ్‌ రంగంలో ఉత్పత్తి 9.8 శాతం క్షీణించింది.  
► విద్యుత్‌ విషయంలో క్షీణ రేటు 1.8 శాతంగా ఉంది.  
► భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, పెట్టుబడులు, డిమాండ్‌కు సంకేతం అయిన క్యాపిటల్‌ గూడ్స్‌ కూడా 15.4 శాతం క్షీణతలో ఉంది.  
► ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలుసహా కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలోని ఉత్పత్తుల్లో క్షీణ రేటు 10.3 శాతంగా ఉంది.  
► ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌కు సంబంధించిన ఉత్పత్తి సైతం 3.3 శాతం క్షీణతలోనే ఉంది.

క్షీణత తగ్గుతూ రావడమే ఊరట...
కరోనా కట్టడి లక్ష్యంగా మార్చి 25వ తేదీ నుంచీ లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తి దారుణంగా 57.3 శాతం క్షీణించింది. మేలో ఈ రేటు మైనస్‌ 33.4 శాతంగా నమోదయ్యింది.  జూన్‌లో ఈ రేటు  మైనస్‌ 15.8 శాతానికి తగ్గింది. జూలైలో మైనస్‌ 10.8 శాతానికి దిగివచ్చింది. తాజా సమీక్షా నెల ఆగస్టులో– క్షీణ రేటు మరింత తగ్గి 8 శాతానికి రావడం కొంత ఊరటనిచ్చే అంశం. అయితే సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి బాటలోకి వచ్చే అవకాశం కూడా ఉందన్న అంచనాలు ఉన్నాయి. 

సేవలు, తయారీ కలగలిపిన కాంపోజిట్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) అవుట్‌పుట్‌  సెప్టెంబర్‌లో క్షీణ బాట నుంచి  54.6కు చేరి వృద్ధి బాటలోకి రావడం ఇక్కడ గమనార్హం. అలాగే  సెప్టెంబర్‌లో ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 56.8కి ఎగసింది. లాక్‌డౌన్‌ ఆంక్షలను క్రమంగా తొలగిస్తుండడంతో పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉందని  గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ప్రకటన పేర్కొంది. 2020 మార్చి 25, మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్‌ 14, ఏప్రిల్‌ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) లాక్‌డౌన్‌ జరిగిన సంగతి తెలిసిందే.

2019 ఆగస్టులోనూ క్షీణతే...
నిజానికి వాణిజ్య యుద్ధం ప్రభావంతో 2019 ఆగస్టులో సైతం పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధిలేకపోగా (2018 ఆగస్టులో పోల్చి) 1.4 శాతం క్షీణతలోనే ఉంది. దెబ్బమీద దెబ్బలాగా కరోనా తీవ్రత నేపథ్యంలో ఉత్పత్తి పరిమాణం కనీసం 2018 ఆగస్టునాటి స్థాయికన్నా దిగువకు ప్రస్తుతం పడిపోవడం తీవ్ర ప్రతికూలతకు అద్దంపడుతోంది.

ఏప్రిల్‌–ఆగస్టు మధ్య 25 శాతం క్షీణత
ఏప్రిల్‌–ఆగస్టు మధ్య పారిశ్రామిక ఉత్పత్తి భారీగా 25% క్షీణించింది. 2019 ఇదే కాలంలో వృద్ధి రేటు 2.5%గా నమోదైంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు