మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌..?

16 Dec, 2023 07:40 IST|Sakshi

ముంబై: భారత్‌ 2026 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని,  దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ  అప్పటికి 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని,  2027లో 5.5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియా విశ్లేషించారు.

‘ఇండియా ఎట్‌ 125: రీక్లెయిమింగ్‌ ది లాస్ట్‌ గ్లోరీ అండ్‌ రిటరి్నంగ్‌ ది గ్లోబల్‌ ఎకానమీ టు ది ఓల్డ్‌ నార్మల్‌’ అనే శీర్షికతో 18వ సీడీ దేశ్‌ముఖ్‌ మెమోరియల్‌ లెక్చర్‌లో ఆయన ఈ మేరకు మాట్లాడుతూ,  ప్రస్తుత డాలర్‌ పరంగా జర్మనీ లేదా జపాన్‌  జీడీపీ  వచ్చే మూడేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్లను దాటే అవకాశం లేదని అన్నారు. జపాన్‌ తన 2022 స్థాయి 4.2 ట్రిలియన్‌ డాలర్ల నుండి 2027లో 5.03 ట్రిలియన్‌ డాలర్లను  చేరుకోవడానికి ప్రస్తుత డాలర్‌ పరంగా 3.5 శాతం వృద్ధి రేటును కొనసాగించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

ఇది సాధ్యం కాకపోవచ్చని వివరించారు. 4 శాతం వార్షిక వృద్ధితో జర్మనీ జీడీపీ 2023లో 4.4 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని, 2025 నాటికి 4.9 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి ఎదుగుతుందని, 2027 నాటికి 5.1 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవిస్తుందని అన్నారు. ఈ అంచనాలను బట్టి చూస్తే, భారత జీడీపీ ఈ రెండు దేశాల జీడీపీలను ఎంత త్వరగా దాటగలదన్నది ప్రశ్నని అన్నారు.

భారత్‌ 2026 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందన్న పూర్తి విశ్వాసం తనకు ఉందని వివరించారు.  చింతామన్‌ ద్వారకానాథ్‌ దేశ్‌ముఖ్‌ (డీసీ దేశ్‌ముఖ్‌) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌గా పనిచేసిన మొదటి భారతీయుడు. 1943 నుండి 1949 వరకు ఆయన పదవీకాలంలో, 1949 బ్యాంకింగ్‌ కంపెనీల చట్టం అమల్లోకి వచ్చింది  తరువాత దీనిని బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టంగా పేరు మార్చడం జరిగింది.   

గణాంకాల ప్రకారం, 1980–81లో భారత్‌ ఎకానమీ పరిమాణం 189 బిలియన్‌ డాలర్లు. దశాబ్దకాలం గడిచే సరికి ఈ విలువ 326 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2000–01 నాటికి 476 బిలియన్‌ డాలర్లకు ఎగసింది. 2010–11 నాటికి ఈ విలువ 1.71 ట్రిలియన్‌ డాలర్లకు చేరగా, 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2.67 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మారింది.

2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ విలువ 3.75 ట్రిలియన్‌ డాలర్లు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్‌ డాలర్లు) కొనసాగుతున్న భారత్‌ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98,374) అంచనా.  2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్‌ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది.

ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్‌ (4.2 ట్రిలియన్‌ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్‌ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్‌ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు  ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు