అదరగొట్టిన ఐటీసీ.. రూ. 5,070 కోట్లు

4 Feb, 2023 12:56 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ, డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 23 శాతం జంప్‌చేసి రూ. 5,070 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,119 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం దాదాపు 4 శాతం వృద్ధితో రూ. 19,021 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 18,366 కోట్ల టర్నోవర్‌ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు 3 శాతంపైగా తగ్గి రూ. 12,772 కోట్లకు పరిమితమయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండు ప్రకటించింది.  

విభాగాలవారీగా.. 
క్యూ3లో సిగరెట్లుసహా మొత్తం ఎఫ్‌ఎంసీజీ విభాగం టర్నోవర్‌ 17 శాతం వృద్ధితో రూ. 12,935 కోట్లకు చేరింది. దీనిలో సిగరెట్ల ఆదాయం 16 శాతం ఎగసి రూ. 8,086 కోట్లను తాకింది. ఇతర ఎఫ్‌ఎంసీజీ నుంచి 18 శాతం అధికంగా రూ. 4,849 కోట్లు సమకూరింది. హోటళ్ల ఆదాయం 49 శాతం జంప్‌చేసి రూ. 739 కోట్లను దాటగా, గోధుమలు, బియ్యం ఎగుమతులపై ఆంక్షల కారణంగా అగ్రిబిజినెస్‌ 36 శాతం క్షీణించి రూ. 3,305 కోట్లకు పరిమితమైంది. పేపర్‌ బోర్డ్స్, ప్యాకేజింగ్‌ టర్నోవర్‌ 13 శాతం పుంజుకుని రూ. 2,306 కోట్లుకాగా.. ఇతర విభాగాల నుంచి రూ. 857 కోట్లు సమకూరింది. ఇది 18 శాతం అధికం.ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్‌ఈలో 0.5 శాతం బలపడి రూ. 381 వద్ద ముగిసింది.

చదవండి: ఎలన్‌ మస్క్‌కు భారీ ఊరట.. ఆ దూకుడుకు కళ్లెం వేయడం కష్టమే!

మరిన్ని వార్తలు