వాటాదారులకు మరింత విలువ

6 Aug, 2021 03:25 IST|Sakshi

ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఏఎం నాయక్‌

షేరుకి రూ. 18 తుది డివిడెండ్‌

న్యూఢిల్లీ: వాటాదారులకు విలువ చేకూర్చడంపై దృష్టిపెట్టిన మౌలిక రంగ దిగ్గజం ఎల్‌అండ్‌టీ ఇందుకు మరిన్ని చర్యలను తీసుకోనున్నట్లు వెల్లడించింది. కీలకంకాని ఆస్తుల విక్రయం, వ్యయ నియంత్రణలు పాటించడం, టెక్నాలజీ వినియోగం ద్వారా ఉత్పాదకతను మెరుగుపరచడం వంటి అంశాలను అమలు చేయనున్నట్లు ఎల్‌అండ్‌టీ గ్రూప్‌ చైర్మన్‌ ఏంఎ నాయక్‌ పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా పలు విభాగాలలోగల వ్యాపార పోర్ట్‌ఫోలియో, ప్రాంతాలవారీ విస్తరణ, పటిష్ట బ్యాలన్స్‌షీట్, వృద్ధిలో ఉన్న ఆర్డర్‌బుక్‌ తదితరాలు కంపెనీ పురోభివృద్ధికి దోహదం చేయనున్నట్లు తెలియజేశారు.

కంపెనీ సాధారణ సర్వసభ్య సమావేశం సందర్భంగా వాటాదారులనుద్దేశించి నాయక్‌ ప్రసంగించారు. తద్వారా పలు అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) లో కంపెనీ పనితీరుపై అప్రమత్తతతోకూడిన ఆశాభావంతో ఉన్నట్లు తెలియజేశారు. కాగా.. గతేడాది(2020–21)కిగాను వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించేందుకు తాజాగా బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే రూ. 18 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు యథాతథంగా రూ. 1,624 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు