L &T: ఎల్‌అండ్‌టీ లాభం జూమ్‌

27 Jul, 2022 09:40 IST|Sakshi

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ ఇంజినీరింగ్‌ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌అండ్‌టీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 45 శాతం జంప్‌చేసి రూ. 1,702 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,174 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 29,335 కోట్ల నుంచి రూ. 35,853 కోట్లకు ఎగసింది.

ఈ కాలంలో 57 శాతం అధికంగా రూ. 41,805 కోట్ల విలువైన గ్రూప్‌ స్థాయి ఆర్డర్లను సాధించింది. వీటిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నుంచి 66 శాతం వృద్ధితో రూ. 18,343 కోట్ల విలువైన కాంట్రాక్టులు లభించాయి. ఇంధన ప్రాజెక్టుల విభాగం నుంచి రూ. 4,366 కోట్ల విలువైన ఆర్డర్లు సంపాదించింది. వెరసి జూన్‌ చివరికల్లా మొత్తం(కన్సాలిడేటెడ్‌) ఆర్డర్‌ బుక్‌ విలువ రూ. 3,63,448 కోట్లకు చేరింది. వీక్‌ క్వార్టర్‌లోనూ నిజానికి ఈపీసీ కంపెనీలకు ప్రధానంగా ఎల్‌అండ్‌టీకి తొలి త్రైమాసికం బలహీనంగా ఉంటుందని, అయినప్పటికీ పటిష్ట ఫలితాలను సాధించగలిగినట్లు కంపెనీ హోల్‌టైమ్‌ డైరెక్టర్, సీఎఫ్‌వో ఆర్‌.శంకర్‌ రామన్‌ పేర్కొన్నారు.

కంపెనీ అంతర్గత పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలియజేశారు. తద్వారా తొమ్మిది విభాగాలను ఏడుగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.  ఈ ఏడాది రోడ్‌ కన్సెషన్‌ ప్రాజెక్టుల నుంచి వైదొలగే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఐదేళ్ల లక్ష్యం 2026 ప్రణాళికలో భాగంగా కొత్త విభాగాలలోకి డైవర్సిఫై అవుతున్నట్లు వెల్లడించారు. వీటిలో గ్రీన్‌ ఎనర్జీ, ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ బిజినెస్‌లున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ షేరు 2% క్షీణించి రూ. 1,751 వద్ద ముగిసింది.

చదవండి: RBI Unclaimed Deposits: క్లెయిమ్‌ చేయని నిధులు రూ.48వేల కోట్లు.. వీటిని ఏం చేస్తారంటే!

మరిన్ని వార్తలు