భారత్‌లో దీపావళి సంబరాలు.. చైనాకు లక్ష కోట్లు నష్టం!

14 Nov, 2023 10:55 IST|Sakshi

భారత్‌లో దీపావళి సంబరాలతో చైనాకు లక్ష కోట్ల ఆదాయం తగ్గింది. అదెలా అంటారా? మన  దేశంలో ప్రతి ఏడాది రక్షా బంధన్‌తో ప్రారంభమైన ఫెస్టివల్‌ సీజన్‌ న్యూ ఇయర్‌ వరకు.. ఇలా ఐదు నెలల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో వ్యాపారస్థులు, ఎగుమతిదారులు పండగ సమయాల్లో ప్రజలకు అవసరమయ్యే నిత్యవసర వస్తువుల్ని చైనా నుంచి భారత్‌కు తెస్తుంటారు. ఆ మొత్తం విలువ సుమారు రూ.80 వేల కోట్లు. 

అయితే  2020 జూన్‌ 15న  తూర్పు లద్దాఖ్‌ వద్ద గల్వాన్‌ నది లోయలో భారత సైనికులు వివిధ అవసరాలకు ఉపయోగిస్తున్న ఓ తాత్కాలిక వంతెనను డ్రాగన్‌ సైన్యం (పీఎల్‌ఏ) తొలగించేందుకు ప్రయత్నించింది. ఇది రెండు దేశాల సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణకు దారితీసింది.నాటి ఘటనలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు. అప్పటికి వంతెనపై ఉన్న కనీసం 38 మంది చైనా సైనికులను చైనా కోల్పోయింది.

ఈ హింసాత్మక ఘటన తర్వాత భారత్‌.. చైనాను అన్ని విధులుగా నిలువరించే  ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పుడే ప్రధాని మోదీ ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ పేరుతో ప్రజలు దేశీయ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. 

అలా దేశంలో చైనా ఉత్పత్తులపై మొదలైన బాయ్‌కాట్‌ ఉద్యమం ప్రతిఏడు చైనాను కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఫలితంగా ఈ ఏడాదిలో దీపావళి వరకు జరిగిన పండుగుల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.3.75 లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరిగాయని వ్యాపార సంస్థల సంఘం.. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) పేర్కొంది.

నవంబర్‌ 14 నుంచి ప్రారంభమయ్యే గోవర్ధన్ పూజ, భాయా దూజ్, నవంబర్‌ 19 ఛాత్ పూజ, నవంబర్‌ 24న జరిగే తులసీ వివాహ్ వంటి పర్వదినాల నేపథ్యంలో మరో రూ.50 వేల కోట్ల విలువైన వ్యాపారం జరిగే అవకాశం ఉందని కెయిట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు.

ఇక, నాలుగు రోజుల పాటు జరిగిన దీపావళి ఫెస్టివల్‌ సీజన్‌లో దేశ వ్యాప్తంగా స్థానిక ఉత్పత్తుల అమ్మకాలతో చైనాకు రూ.1 లక్ష కోట్ల ఆదాయం తగ్గిందని  వెల్లడించారు. ‘ఇంతకుముందు దేశవ్యాప్తంగా దీపావళి సందర్భంగా దాదాపు 70 శాతం చైనా ఉత్పత్తులే అమ్ముడయ్యేవి. కానీ ప్రధాని నరేంద్రమోదీ అభ్యర్థన మేరకు వ్యాపారులు స్థానిక ఉత్పత్తులనే విక్రయించారు. వినియోగదారులు కూడా దేశీయ ఉత్పత్తులను ఆదరించారు’ అని కెయిట్ సెక్రటరీ జెనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు