బడ్జెట్‌ ముందు బుల్‌ దూకుడు

30 Jan, 2024 05:40 IST|Sakshi

రాణించిన రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ

ఆసియా, యూరప్‌ మార్కెట్లలో సానుకూలతలు

1,241 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌  

21,700 స్థాయిపైకి నిఫ్టీ

ముంబై: బడ్జెట్‌ వారాన్ని స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాలతో ఆరంభించింది. రిలయన్స్‌(7%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(1.53%) షేర్లు రాణించడంతో పాటు ఆసియా, యూరప్‌ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. మధ్యంతర బడ్జెట్‌పై ఆశావహ అంచనాలు, ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లను పెంచకపోవచ్చనే ఆశలూ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇటీవల క్యూ3 ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం ఆశావహ అవుట్‌లుక్‌ వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచాయి.

ఫలితంగా సూచీలు దాదాపు 2% ర్యాలీ చేసి నెల రోజుల్లో(డిసెంబర్‌ 5, 2023 తర్వాత) అతిపెద్ద ఒక రోజు లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్‌ 1,241 పాయింట్లు పెరిగి 71,942 ముగిసింది. నిఫ్టీ 385 పాయింట్లు బలపడి 21,738 వద్ద నిలిచింది. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.

ఇంధన, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, సర్వీసెస్, క్యాపిటల్‌ గూడ్స్, పారిశ్రామిక, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ షేర్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ ఇండెక్సులు 1.68%, 1.03% చొప్పున లాభపడ్డాయి. ఆసియాలో చైనా, సింగపూర్‌ మినహా అన్ని దేశాల స్టాక్‌ సూచీలు ఒకశాతం లాభపడ్డాయి. యూరప్‌లో బ్రిటన్, ఫాన్స్‌ సూచీలు అరశాతం పెరిగాయి. అమెరికా స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.    

జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద  
సెన్సెక్స్‌ సుమారు 2% ర్యాలీతో బీఎస్‌ఈలో రూ.6.08 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.377 లక్షల కోట్లకు చేరింది.

ఇంధన షేర్లకు భారీ డిమాండ్‌  
పశ్చిమాసియా సంక్షోభంతో ఎర్రసముద్రం నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం కారణంగా నవంబర్‌ నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న ఇంధన రంగ షేర్లకు సోమవారం అనూహ్యంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఓఎన్‌జీసీ, క్యాస్ట్రోల్‌ 8%, రిలయన్స్, కోల్‌ ఇండియా 6%, హిందుస్థాన్‌ పెట్రోలియం 5%, బీపీసీఎల్, గెయిల్‌ 4%, ఇంధప్రస్థగ్యాస్‌ 3%, ఆయిల్‌ ఇండియా, ఐఓసీ 2% షేర్లు రాణించాయి.

రి‘లయన్స్‌’ గర్జన
ఇంధన రంగ షేర్ల ర్యాలీలో భాగంగా రిలయన్స్‌ షేరు 7% ర్యాలీ చేసి రూ.2896 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో ఏడుశాతానికి పైగా లాభపడి రూ. 2905 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. షేరు భారీ ర్యాలీతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒక్కరోజులోనే రూ.1.25 లక్షల కోట్లు పెరిగి తొలిసారి రూ.19.59 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ సూచీలో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. కాగా గత 3 ట్రేడింగ్‌ సెషన్లలో ఈ షేరు మొత్తం 9% లాభపడింది.

whatsapp channel

మరిన్ని వార్తలు