ఎస్‌యూవీలపై మారుతీ సుజుకీ గురి

18 Feb, 2023 08:10 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌ (ఎస్‌యూవీ) విభాగంపై దృష్టిసారించింది. ఈ సెగ్మెంట్లో 2023–24లో 33 శాతం వాటా చేజిక్కించుకోవడం ద్వారా తొలి స్థానాన్ని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం బ్రెజ్జా, గ్రాండ్‌ వితారా ఎస్‌యూవీలను కంపెనీ విక్రయిస్తోంది. 

మార్చి నుంచి జిమ్నీ, ఫ్రాంక్స్‌ మోడళ్లు రోడ్డెక్కనున్నాయి. జిమ్నీ ఇప్పటికే 17,500 యూనిట్లు, ఫ్రాంక్స్‌ 8,500 యూనిట్ల బుకింగ్స్‌ను కైవసం చేసుకోవడం విశేషం. భారత ప్యాసింజర్‌ వాహన రంగంలో స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌ వాటా 42.5 శాతం ఉంది. 2022–23లో ఇది 45 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. 

ఈ విభాగంలో మారుతీ సుజుకీ వాటా 11.5 శాతం. మొత్తం ప్యాసింజర్‌ వాహన పరిశ్రమలో సంస్థకు ఏకంగా 45 శాతం వాటా ఉంది. దీనిని 50 శాతానికి పెంచుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. 2023 జనవరిలో ఎస్‌యూవీల విపణిలో మారుతీ సుజుకీ 15 శాతం వాటా దక్కించుకుంది. స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌ విభాగంలో 2021–22లో టాటా మోటార్స్‌కు 18 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రాకు 15 శాతం వాటా ఉన్నట్టు సమాచారం.    

మరిన్ని వార్తలు