Germany Metro Stores: ఇండియాలో వ్యాపారానికి ‘మెట్రో’ గుడ్‌బై ?

20 May, 2022 11:51 IST|Sakshi

జర్మన్‌కి చెందిన ప్రముఖ రిటైల్‌ బిజినెస్‌ సంస్థ మెట్రో స్టోర్స్‌ ఇండియాలో తన వ్యాపార కార్యకలాపాలకు పులిస్టాప్‌ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. 19 ఏళ్ల పాటు ఇండియాలో కొనసాగిన ఆ సంస్థ చివరకు ఇక్కడ ఫలితాలు ఆశజనకంగా లేకపోవడంతో వీడి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

వంద శాతం విదేశీ పెట్టుబడులతో దేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో స్టోర్లు ఏర్పాటయ్యాయి. 2003లో ఇండియాలో మెట్రో బిజినెస్‌ మొదలు కాగా.. దేశంలోని 21 నగరాల్లో 31 స్టోర్లు ఆ సంస్థకు ఉన్నాయి. హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో తొలిసారి మెట్రో స్టోరు ఏర్పాటు కావడం అప్పట్లో సంచనలంగా మారింది. మెట్రో తర్వాత అనేక సంస్థలు ఇదే మోడల్‌ను అనుసరిస్తూ రిటైల్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి.

ఇండియాలో
ఇండియాలో రిటైల్‌ స్టోర్లతో పాటు కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, వెస్ట్‌బెంగాల్‌లలో ఐదు కలెక‌్షన్‌ సెంటర్లు ఉన్నాయి. ఏడు వేల రకాలకు పైగా వస్తువులు మెట్రో స్టోర్లలో అమ్ముతున్నారు. 2025 నాటికి ఇండియాలో మెట్రో బిజినెస్‌ అంచనా 1.25 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

ఇక చాలు
పందొమ్మిదేళ్లు గడిచినా ఇండియాలో మెట్రో వృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. పైగా మెట్రో తరహాలోనే అనేక సంస్థలు రిటైల్‌ బిజినెస్‌లోకి వచ్చాయి. ఇంత పోటీలో ఇక్క భవిష్యత్తు మరింత కష్టంగా ఉండవచ్చనే అంచనాలు మెట్రో యజమాన్యానికి ఉన్నాయి. దీంతో ఇండియాలో తమ బిజినెస్‌కి పులిస్టాప్‌ పెట్టాలని నిర్ణయించింది.

జేపీ మోర్గాన్‌
ఇండియాలో ఆ సంస్థకు ఉన్న 31 స్టోర్లు, 5 కలెక‌్షన్‌ సెంటర్లు ఇతర స్థిర, చర ఆస్తులను కొనేందుకు అనువైన బయ్యర్‌ను వెతికి పెట్టాల్సిందిగా జేపీ మోర్గాన్‌ సంస్థను మెట్రో కోరింది. ఈ మేరకు 1.5 నుంచి 1.75 బిలియన్‌ డాలర్ల రేంజ్‌లో అమ్మేందుకు రెడీ అయ్యింది మెట్రో. రిలయన్స్‌, అమెజాన్‌, డీ మార్ట్‌ వంటి ప్రముఖ సంస్థలు మెట్రో డీల్‌ పట్ల ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.

ఎందుకంటే
‘ప్రపంచ వ్యాప్తంగా మెట్రోకు వ్యాపారాలు ఉన్నాయి. ప్రతీ ఏడు మేము నిర్ధేశించుకున్న లక్ష్యాలు వాటిని చేరుకున్న తీరును మదింపు చేసుకుని వ్యూహాలు అమలు చేస్తుంటాం. అందులో భాగంగానే ఇండియా విషయంలో నిర్ణయం తీసుకుంటాం తప్పితే ప్రత్యేక కారణాలు ఏమీ లేవు’ అంటూ మెట్రో గ్లోబల్‌ హెడ్‌ జెర్డ్‌ కోస్‌లోవ్‌స్కీ అన్నారు.

అక్కడ కూడా
మెట్రో స్టోర్స్‌ అనేక దేశాల్లో ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా ఆ సంస్థ పలు దేశాల్లో ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేకపోయింది. దీంతో ఇప్పటికే రష్యా, జపాన్‌, మయన్నార్‌ల నుంచి వైదొలగింది. తాజాగా ఈ జాబితాలో ఇండియా కూడా చేరింది. 

చదవండి: ధన్యవాదాలు.. కానీ మేము ఆ పని ఇక్కడ చేయలేం..

మరిన్ని వార్తలు