ఎమర్జెన్సీ వినియోగానికి మరో వ్యాక్సిన్‌ రెడీ!

1 Dec, 2020 09:07 IST|Sakshi

యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతికి దరఖాస్తు 

యూరోపియన్‌ నియంత్రణ సంస్థలకూ

వ్యాధితీవ్రత ఉన్న కేసుల్లో 100 శాతం ఫలితాలు

తాజాగా మోడర్నా ఇంక్‌ వెల్లడి

న్యూయార్క్‌: మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ 1273 పేరుతో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగించేందుకు అనుమతించవలసిందిగా అమెరికన్, యూరోపియన్‌ ఔషధ నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేస్తున్నట్లు తాజాగా గ్లోబల్‌ ఫార్మా కంపెనీ మోడర్నా ఇంక్‌ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా యూస్‌ఎఫ్‌డీఏ, యూరోపియన్‌ మెడిసిన్‌ ఏజెన్సీలను ఆశ్రయించినట్లు పేర్కొంది. కోవిడ్‌-19 సోకి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారిపై తమ వ్యాక్సిన్‌ 100 శాతం ప్రభావం చూపుతున్నట్లు తాజాగా తెలియజేసింది. వ్యాక్సిన్‌ తుది దశ క్లినికల్‌ పరీక్షలలో 94.1 శాతం సత్ఫలితాలు వెలువడినట్లు మోడర్నా ఇప్పటికే ప్రకటించింది. కాగా.. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న కేసులలో 100 శాతం విజయవంతమైనట్లు కంపెనీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్ తాల్‌ జాక్స్‌ తాజాగా పేర్కొన్నారు. ఇందుకు క్లినికల్‌ డేటా నిదర్శనంగా నిలవనున్నట్లు తెలియజేశారు. ఫలితంగా కోవిడ్‌-19ను కట్టడి చేయడంలో తమ వ్యాక్సిన్‌ అత్యంత ప్రభావవంతంగా పనిచేయనున్నట్లు తెలియజేశారు. ఇటీవల కంపెనీ తయారీ వ్యాక్సిన్‌ సాధారణ రిఫ్రిజిరేటర్‌ టెంపరేచర్లలోనూ నిల్వ చేసేందుకు వీలున్నట్లు వార్తలు వెలువడిన విషయం విదితమే. యూఎస్‌లో పంపిణీకి ఈ ఏడాది చివరికల్లా 2 కోట్ల డోసేజీలను అందుబాటులో ఉంచే వీలున్నట్లు మోడర్నా ఇంక్‌ తెలియజేసింది.

ఈ నెల 17న
మోడర్నా ఇంక్‌ వ్యాక్సిన్‌పై సమీక్షను చేపట్టేందుకు యూఎస్‌ఎఫ్‌డీఏకు చెందిన స్వతంత్ర సలహాదారులు ఈ నెల 17న సమావేశంకానున్నారు. తద్వారా వ్యాక్సిన్‌ సంబంధ బయోలాజికల్‌ ప్రొడక్ట్స్‌ అడ్వయిజరీ కమిటీ(వీఆర్‌బీపీఏసీ)గా పిలిచే సలహాదారులు వ్యాక్సిన్లపై ఎఫ్‌డీఏకు సూచనలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఎమర్జీన్సీ వినియోగం కోసం ఇప్పటికే యూఎస్‌ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసిన ఫైజర్‌ ఇంక్‌ వ్యాక్సిన్‌పై ఈ నెల 10న సమీక్షను నిర్వహించనున్నారు. రెండు కంపెనీల డేటాను మదింపు చేశాక యూఎస్‌ఎఫ్‌డీఏకు వీరు సలహాలు అందించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా