రవాణా ఖర్చుల భారం..తక్కువ డిమాండ్‌.. ఇబ్బందుల్లో ఎంఎస్‌ఎఈలు

23 Dec, 2022 11:26 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒకవైపు డిమాండ్‌ తగ్గడం, మరోవైపు అధిక రవాణా చార్జీల కారణంగా పెరిగిపోయిన తయారీ వ్యయాల భారం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలుగా ఓ సర్వే తెలిపింది. ఈ సర్వే నివేదికను భారతీయ యువశక్తి ట్రస్ట్‌ (బీవైఎస్‌టీ) విడుదల చేసింది. 

మార్కెట్‌ స్థిరపడినప్పటికీ, 57 శాతం ఎంఎస్‌ఎంఈలు తాము కొత్త ఆర్డర్లను పొందడంలో సమస్యలు చవిచూస్తున్నట్టు చెప్పాయి. వినియోగదారుల తక్కువ కొనుగోలు శక్తి డిమాండ్‌ తగ్గేందుకు దారితీసినట్టు బీవైఎస్‌టీ మేనేజింగ్‌ ట్రస్టీ లక్ష్మీ వెంకటరామన్‌ వెంకటేశన్‌ పేర్కొన్నారు. ఈ సర్వేలో 5,600 మంది ఎంఎస్‌ఎంఈలు పాల్గొన్నాయి.

‘‘కరోనా ప్రభావం క్రమంగా సమసిపోతోంది. అయినప్పటికీ ఎన్నో అంశాల వల్ల ఆర్థిక కార్యకలాపాలు ఇంకా కుదురుకోవాల్సి ఉంది’’అని ఈ సర్వే నివేదిక తెలిపింది. రుణ వాయిదాలను సకాలంలో చెల్లించలేకపోతున్నామని 27 శాతం ఎంఎస్‌ఎంఈలు చెప్పాయి. కరోనా ముందు నాటితో పోలిస్తే కొన్ని అంశాల్లో మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు 53 శాతం తెలిపాయి.    

మరిన్ని వార్తలు