సుందర్‌ పిచాయ్‌పై ముంబైలో కేసు, ఎఫ్‌ఐఆర్‌ నమోదు! ఎందుకంటే..

26 Jan, 2022 17:06 IST|Sakshi

Police Complaint Against Sundar Pichai: గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌పై బుధవారం పోలీస్‌ కేసు నమోదు అయ్యింది. కోర్టు ఆదేశాల మేరకు ముంబై పోలీసులు పిచాయ్‌తో పాటు ఐదుగరు కంపెనీ ప్రతినిధులపైనా కేసు బుక్‌ చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాపీరైట్‌ యాక్ట్‌ వయొలేషన్‌ కింద ఈ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. 


‘ఏక్‌ హసీనా థీ ఏక్‌ దివానా థా’ అనే సినిమాను తన అనుమతి లేకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారంటూ ఆ సినిమా డైరెక్టర్‌, నిర్మాత అయిన సునీల్‌ దర్శన్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు యూట్యూబ్‌ ఓనర్‌ కంపెనీ అయిన ‘గూగుల్‌’ ప్రతినిధుల పేర్లతో(సుందర్‌ పిచాయ్‌ ఇతరులు) ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. తన సినిమా హక్కుల్ని ఎవరికీ అమ్మలేదని, అలాంటిది యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా తనకు నష్టం వాటిల్లిందంటూ ఫిర్యాదుధారి సునీల్‌ చెప్తున్నారు. ఇల్లీగల్‌ అప్‌లోడింగ్‌ విషయంలో యూట్యూబ్‌కు ఎన్ని ఫిర్యాదు చేసినా స్పందన లేదని, అందుకే తాను ఈ చర్యకు దిగానని అంటున్నారు. 

ఇదిలా ఉంటే ఏక్‌ హసీనా థీ ఏక్‌ దివానా థా 2017లో రిలీజ్‌ అయ్యింది. రొమాంటిక్‌ మ్యూజికల్‌ డ్రామాగా ప్రమోట్‌ చేసుకున్న ఈ సినిమా.. డిజాస్టర్‌గా నిలిచింది. అయితే  అదొక బీ గ్రేడ్‌ సినిమా అని, దీని మీద కూడా ఆ దర్శకుడు కోర్టుకెక్కడం విడ్డూరంగా ఉందంటూ కొందరు సరదా కామెంట్లు చేస్తున్నారు. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు తాజాగా పద్మ భూషణ్‌ పురస్కారం గౌరవం దక్కిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు