మగబిడ్డకు జన్మనిచ్చిన అపర్ణ కృష్ణన్ - ఆనందంలో నారాయణ మూర్తి ఫ్యామిలీ

16 Nov, 2023 18:58 IST|Sakshi

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్ నవంబర్ 10న బెంగళూరులో పండండి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లితో పాటు బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రోహన్ మూర్తి, అపర్ణ కృష్ణన్ ముద్దుల బాబుకి 'ఏకాగ్ర' అని పేరుపెట్టారు. ఈ పేరుకి సంస్కృతంలో అచంచలమైన దృష్టి లేదా ఏకాగ్రత అని అర్థం వస్తుందని చెబుతున్నారు. నారాయణ మూర్తి, సుధా మూర్తికి.. కృష్ణ సునక్, అనౌష్క సునక్ అనే ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. వీరిరువురూ యూకే ప్రధాన మంత్రి రిషి సునక్, అక్షతా మూర్తి కుమార్తెలు.

నారాయణ మూర్తి వేలకోట్ల సంపదకు వారసుడైన 'రోహన్ మూర్తి'.. తండ్రి మాదిరిగానే సొంతకాళ్ళ మీద నిలబడాలని కొత్త కంపెనీని ప్రారంభించడానికి ఇన్ఫోసిస్‌లో వైస్ ప్రెసిడెంట్ పదవిని వదిలేసాడు. అనుకున్న విధంగానే 'సోరోకో' (Soroco) పేరుతో సంస్థ స్థాపించి కోట్లు గడిస్తున్నాడు.

ఇదీ చదవండి: అందుకే 'రోహన్ మూర్తి' ఇన్ఫోసిస్ జాబ్ వదిలేసాడు!

బెంగళూరులోని బిషప్ కాటన్ బాయ్స్ స్కూల్‌లో చదువుకున్న రోహన్.. ఆ తరువాత కార్నెల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్, హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ (PhD) పొందాడు. చదువు పూర్తయిన తరువాత 2011లో టీవీఎస్ గ్రూప్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మి వేణుని వివాహం చేసుకున్నాడు. కొన్ని అభిప్రాయ భేదాల వల్ల 2015లో ఈ జంట విడిపోయింది. 

లక్ష్మి వేణుతో విడాకులైన తరువాత రోహన్ మూర్తి రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్ కమాండర్ KR కృష్ణన్, మాజీ SBI ఉద్యోగి సావిత్రి కృష్ణన్ కుమార్తె 'అపర్ణ కృష్ణన్‌'ను 2019లో వివాహం చేసుకున్నారు. వీరిరువురు ఇప్పుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

మరిన్ని వార్తలు