గరం గరం మిర్చి ... స్పేస్‌లో పండించారు మరి!

10 Dec, 2021 04:38 IST|Sakshi

వీరంతా ‘నాసా’ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోని వ్యోమగాములు. ఇలా మిరపకాయలు చూపుతున్నారేంటి అంటుకుంటున్నారా? మరి ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. భూమికి సుమారు 300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఐఎస్‌ఎస్‌లో మైక్రో గ్రావిటీ స్థితిలో వారు పండించినవి!! వాటిని రుచి చూసే ముందు ఇలా కోతకోసిన ‘పంట’ను చూపి తెగ సంబరపడ్డారన్నమాట. ఆపై ఈ మిరపకాయల్లో కొన్నింటిని ఫజీతా బీఫ్‌తోపాటు కాయగూరల్లోకి చేర్చుకొని తిన్నారు. అంతరిక్షంలో మిరపకాయలు పండించడం ఇది రెండోసారి అయినప్పటికీ వాటిని వ్యోమగాములు ఆహారంలో ఉపయోగించడం మాత్రం ఇదే తొలిసారి. నెల రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది. 


కాస్త ఆలస్యంగా కాపు... 
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో పండించిన మిరపకాయలు భూమ్మీది కంటే కాస్త ఆలస్యంగా కాపుకు వచ్చాయని, 120 రోజులకు బదులు 137 రోజుల తరువాత కాయలు కోతకు సిద్ధమయ్యాయని పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త మాట్‌ రోమీన్‌ వివరించారు. ప్లాంట్‌ హ్యాబిటాట్‌–04లో అక్టోబర్‌లో కాయల్ని కోశామని.. అదే సమయంలో వ్యోమగాములు మారుతుండటంతో వచ్చిన వారితోపాటు మళ్లీ భూమ్మీదకు వెళుతున్న వారికీ కొన్ని మిరపకాయలను పంపామని (ల్యాబ్‌లో ప్రయోగాలకు) తెలిపారు. ఇలా 137 రోజులపాటు పంట పండించడం ఐఎస్‌ఎస్‌లో రికార్డన్నారు. ప్రయోగం విజయవంతమైనం దున త్వరలోనే చిన్నసైజు టొమాటోలు, ఆకుకూరలు పండించే ప్రయత్నం చేస్తామని రోమీన్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు