Space Line: ఆకాశానికి నిచ్చెనొద్దు.. చంద్రునికి తాడు బిగించి..

8 Nov, 2023 14:04 IST|Sakshi

చందమామపై నుంచి బలమైన తాడును ఆకాశం మీదుగా భూమి మీదకు వదిలితే.. మనం అంతరిక్షంలో ఈజీగా చెక్కర్లు కొట్టొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ‘స్పేస్‌ లైన్‌’ ఏర్పాటు ద్వారా అసాధ్యాలు సుసాధ్యమవుతాయని నొక్కివక్కాణిస్తున్నారు. ఇందుకు భారీగా ఖర్చు కూడా కాబోదని చెబుతున్నారు. ఇంతకాలం ఆకాశానికి నిచ్చెన వేయాలనుకుంటున్న మనం ఇప్పుడు దానికి రివర్స్‌లో.. అంటే చంద్రునికి తాడు బిగించే ప్రయత్నం చేయాలంటున్నారు శాస్త్రవేత్తలు.  

అంతరిక్షయానానికి సంబంధించి శాస్త్రవేత్తలకు ఎదురవుతున్న అతి పెద్ద ప్రతిబంధకం భూ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించేందుకు అధిక వ్యయం కావడం. అయితే యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన జెఫిర్ పెనోయ్రే, న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఎమిలీ శాండ్‌ఫోర్డ్‌ల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం మనం వినియోగిస్తున్న రాకెట్ ఇంజిన్‌ల పనివిధానాల సూత్రాలే అంతరిక్ష ప్రయోగాలకు అధికవ్యయం అయ్యేందుకు కారణంగా నిలుస్తున్నాయి.

ప్రస్తుతమున్న విధానంలో వ్యోమనౌక భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో ప్రయాణించేందుకు అవసరమయ్యే శక్తిని ఉత్పత్తి చేయడానికి గణనీయమైన మొత్తంలో ఇంధనం అవసరమవుతుంది. ఇందుకోసం అధికవ్యయం చేయాల్సివస్తుంది. దీనికి ప్రతిపాదిత పరిష్కారం స్పేస్ ఎలివేటర్‌ను నిర్మించడం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ విధానంలో భూమి ఉపరితలం నుండి నిర్ణీత కక్ష్య వరకు విస్తరించిన ఒక కేబుల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది అంతరిక్షంలోకి అధిరోహించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. ఈ వ్యవస్థ అందించే ప్రాథమిక ప్రయోజనం ఏమిటంటే, అధిరోహణ ప్రక్రియ కోసం సౌరశక్తిని ఉపయోగించుకునే అవకాశం కలిగివుండటం. తద్వారా  అత్యధిక ఇంధన వినియోగం అవసరమవదు. 

అయితే స్పేస్‌ ఎలివేటర్‌ ఆపరేషన్ కోసం వినియోగించే కేబుల్ అసాధారణమైన బలాన్ని కలిగి ఉండాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలలో ఇందుకు అవసరమైన సామర్థ్యం లేదు. అయితే ఆధునిక శాస్త్రవేత్తలు పెనోయ్రే, శాండ్‌ఫోర్డ్ స్పేస్ ఎలివేటర్ భావనకు ప్రత్యామ్నాయంగా ‘స్పేస్‌లైన్’ అనే సంస్కరణను ప్రతిపాదించారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించి దీనిని నిర్మించవచ్చని వారు అంటున్నారు.

కాగా స్పేస్ ఎలివేటర్ ఏర్పాటులో భూమి లోతుల్లో ఒక కేబుల్‌ ఉంటుంది. అది భూమికి దాదాపు 42 వేల కిలోమీటర్లు (26,098 మైళ్ళు) దూరంలో ఉన్న జియోసింక్రోనస్ కక్ష్య దాటి విస్తరించి ఉంటుంది. ఈ రకమైన కేబుల్ గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే స్పేస్ ఎలివేటర్ ప్రయోగం విజయవంతమవుతుంది. దశాబ్దాలుగా భౌతిక శాస్త్రవేత్తలు, సైన్స్ ఫిక్షన్ రచయితలు తమ స్పేస్‌ ఎలివేటర్‌ ఆలోచనలకు ఊపిరి పోస్తున్నారు. అయితే ఈ ప్రయోగానికి తగిన సామర్థాన్ని అందించే పరికరాల లోపంతో ప్రయోగాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

ఇంతలో శాస్త్రవేత్తలు పెనోయ్రే, శాండ్‌ఫోర్డ్‌లు స్పేస్ ఎలివేటర్‌కు ప్రత్యామ్నాయంగా తాము ప్రతిపాదించిన ‘స్పేస్‌లైన్’ను సూచిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రుడిపై అత్యంత బలమైన తీగ(తాడు) లాంటిదాన్ని బిగించి, దాన్ని భూమి కక్ష్య వరకు వేలాడేలా చేయాలి. దీంతో భూమిపై నుంచి వెళ్లే రాకెట్లు ఈ బలమైన తీగ సహాయంతో అవతలి ఎండ్‌కు చేరుకుంటాయి. సరిగ్గా ఆ ఎండ్ దగ్గరే రాకెట్లు పార్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆస్ట్రోనాట్‌లు ఈ తీగ వెంబడి మరో రాకెట్‌లో స్పేస్ ట్రావెల్ చేసి, ఈజీగా చంద్రుణ్ణి చేరుకోవచ్చు. 

సాధారణంగా రాకెట్ ద్వారా స్పేస్‌లో ప్రయాణించాలంటే ఈ మార్గంలో ఎన్నో అడ్డంకులను  ఎదుర్కోవలసి వస్తుంది. మధ్యలో ఎప్పుడైనా ఏ ఆస్టరాయిడ్ అయినా వచ్చి తగిలే అవకాశం ఉంటుంది. అదే ఈ బలమైన తీగ వెంబడి ప్రయాణిస్తే అటువంటి ​‍ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు చెబున్నారు. అంతేకాకుండా ఇటువంటి ప్రయోగం ద్వారా తక్కువ ఇంధనంతోనే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కూడా చెబుతున్నారు. పైగా ఇందుకు అవసరమయ్యే శక్తిని సౌరశక్తితో అప్పటికప్పుడే జనరేట్ చేసుకోవచ్చంటున్నారు. 

ఇటువంటి స్పేస్‌లైన్‌ను నిర్మించేందుకు కావాల్సిన అన్ని టెక్నాలజీలు, మెటీరియల్స్ మనకు అందుబాటులోనే ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికా, చైనా, రష్యా లాంటి అగ్రరాజ్యాలు ఇప్పటికే చంద్రునిపై పాగా వేయాలని చూస్తూ, అందుకు తగిన ప్రయోగాలు కూడా చేస్తున్నాయి. ఇదే ఆలోచనతో ఉన్న స్పేస్ ఎక్స్ సంస్థ ఇంకో నాలుగేళ్లలో అంగారకునిపై కాలనీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ స్పేస్‌లైన్‌ ప్రాజెక్ట్ విజయవంతం అయితే స్పేస్‌లో పలు అంతరిక్ష పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశముంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: కన్నీళ్లకే కన్నీళ్లొచ్చె: సోదరి మృతదేహాన్ని నడుముకు కట్టుకుని..

మరిన్ని వార్తలు