Tokenization Rule: క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్లకు ఊరట..! ఆన్‌లైన్‌ లావాదేవీలపై ఆర్బీఐ కీలక నిర్ణయం..!

23 Dec, 2021 20:37 IST|Sakshi

క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్లకు ఊరట కల్పిస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల టోకనైజేషన్‌ విధానాల అమలును మరో ఆరు నెలలపాటు పొడిగించింది. ఆర్బీఐ ఒక ప్రకటనలో...సీఓఎఫ్‌(కార్డ్‌ ఆన్‌ ఫైల్‌ డేటా) ను నిల్వ చేసేందుకు మరో ఆరు నెలల పాటు పొడిగించినట్లు పేర్కొంది. దీంతో కొత్త టోకెనైజేషన్‌ పాలసీ 2022 జూలై 1 నుంచి ప్రారంభంకానుంది. 

డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చాలనే లక్ష్యంతో ఈ కొత్త రూల్స్‌ను ఆర్బీఐ ప్రవేశపెట్టనుంది. వచ్చే ఏడాది జనవరి 1 తో కొత్త రూల్స్‌ వచ్చే నేపథ్యంలో ఇప్పటికే ఆయా బ్యాంకులు మర్చంట్ వెబ్‌సైట్ లేదా పలు యాప్‌లో క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలను స్టోర్ చేసే విషయంలో ఖాతాదారులను అలర్ట్‌ చేశాయి. ప్రస్తుతం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులకు ఊరట కల్గనుంది. టోకనైజేషన్‌ విధానాలతో ఆయా క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్ వివరాలను బహిర్గతం చేయకుండా ఆన్‌లైన్ కొనుగోళ్లను అనుమతిస్తుంది.

సీఐఐ అభ్యర్థన మేరకే..!
ఇటీవల టోకనైజేషన్‌ను అమలు చేయడానికి కనీసం ఆరు నెలల సమయాన్ని ట్రేడ్‌ యూనియన్‌ వ్యాపారులు కోరారు. దీని  అమలు పలు అంతరాయాలను కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.  ఆర్‌బీఐ కొత్త నియమాల కారణంగా ఆన్‌లైన్ మర్చెంట్స్‌ తమ రాబడిలో 20 నుంచి 40 శాతం మేర నష్టపోయే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) గతంలో పేర్కొంది.

ఆర్‌బీఐ వార్షిక నివేదిక ప్రకారం...2020-21లో భారత డిజిటల్ చెల్లింపుల పరిశ్రమ విలువ రూ. 14,14,85,173 కోట్లుగా ఉంది. కరోనా మహమ్మారి సమయంలో డిజిటల్ చెల్లింపులు ఆర్థిక వృద్ధిని ప్రేరేపించాయని సీఐఐ పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు  98.5 కోట్ల కార్డ్‌లు ఉన్నాయని అంచనా. వీటితో ఒకే రోజు సుమారు 1.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని సీఐఐ తెలిపింది. 

చదవండి: వ్యాపారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి కొత్త జీఎస్‌టీ రూల్స్..!

మరిన్ని వార్తలు