వాహన కొనుగోలు దారులకు భారీ షాక్‌!

11 Oct, 2022 08:48 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి కఠినతరమైన ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో కార్లు, వాణిజ్య వాహనాల రేట్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి స్థాయి ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను తీర్చిదిద్దాలంటే కంపెనీలు మరింత అధునాతనమైన విడిభాగాలు, పరికరాలను వాహనాల్లో ఉపయోగించాల్సి ఉంటుంది. ఫలితంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. కంపెనీలు ఈ భారాన్ని అంతిమంగా కొనుగోలుదారులకే బదలాయిస్తాయి.

కొత్త ప్రమాణాల ప్రకారం ఎప్పటికప్పుడు ఉద్గారాల స్థాయులను పర్యవేక్షించేందుకు వాహనాల్లో సెల్ఫ్‌–డయాగ్నోస్టిక్‌ డివైజ్‌ను అమర్చాల్సి ఉంటుంది. ఒకవేళ కాలుష్యకారక వాయువులు నిర్దేశిత ప్రమాణాలను దాటిపోతే వాహనాన్ని సర్వీస్‌కు ఇవ్వాలంటూ వార్నింగ్‌ లైట్ల ద్వారా ఈ పరికరం తెలియజేస్తుంది. అలాగే, ఇంజిన్‌లోకి ఎంత ఇంధనం, ఎప్పుడు విడుదల అవ్వాలనేది నియంత్రించేందుకు ప్రోగ్రాం చేసిన ఫ్యుయల్‌ ఇంజెక్టర్లను ఏర్పాటు చేయాలి. ఇంజిన్‌ ఉష్ణోగ్రత, గాలి పీడనం మొదలైన వాటిని పర్యవేక్షించేలా సెమీకండక్టర్లను కూడా అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉంటుంది.  

డిమాండ్‌పై ప్రభావం..  
కొత్త ప్రమాణాలకు తగ్గట్లుగా వాహనాలను రూపొందించాలంటే ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతాయని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ రోహన్‌ కన్వర్‌ గుప్తా తెలిపారు. సెల్ఫ్‌ డయాగ్నాస్టిక్‌ డివైజ్‌లు, హార్డ్‌వేర్‌.. సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడేషన్‌ మొదలైన వాటిపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. గత 15–18 నెలలుగా అధిక ద్రవ్యోల్బణం కారణంగా వాహన కంపెనీలు రేట్లను పెంచుతూనే ఉన్నాయని .. మరింతగా పెంచితే డిమాండ్‌పై కొంత ప్రభావం పడే అవకాశం ఉందని గుప్తా తెలిపారు. కాలుష్య కట్టడిలో భాగంగా  2020 ఏప్రిల్‌ 1 నుంచి వాహనాల కంపెనీలు బీఎస్‌4 ప్రమాణాల నుంచి నేరుగా బీఎస్‌6 ప్రమాణాలకు మారాల్సి వచ్చింది. వీటికి అనుగుణంగా టెక్నాలజీని అప్‌గ్రేడ్‌ చేసుకునేందుకు దేశీ ఆటోమొబైల్‌ పరిశ్రమ వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది.   

నవరాత్రికి వాహనాల జోరు 
నవరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రిటైల్‌లో 5,39,227 వాహనాలు అమ్ముడయ్యాయి. దేశ చరిత్రలో నవరాత్రికి జరిగిన విక్రయాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 57 శాతం అధికమని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ ప్రకటించింది. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 5 మధ్య ఈ విక్రయాలు జరిగాయి. 2019 నవరాత్రి సందర్భంగా భారత్‌లో 4,66,128 యూనిట్లు రోడ్డెక్కాయి. మూడేళ్ల తరువాత వినియోగదార్లతో షోరూములు కిటకిటలాడాయి. ద్విచక్ర వాహనాలు 52.35 శాతం దూసుకెళ్లి 3,69,020 యూనిట్లు నమోదయ్యాయి. కోవిడ్‌ ముందస్తు సంవత్సరం 2019తో పోలిస్తే 3.7 శాతం వృద్ది సాధించడం విశేషం. ప్యాసింజర్‌ వాహనాలు 70.43 శాతం ఎగసి 1,10,521 యూనిట్లుగా ఉంది. వాణిజ్య వాహనాలు 48.25 శాతం పెరిగి 22,437 యూనిట్లు నమోదైంది. త్రిచక్ర వాహనాలు రెండు రెట్లకుపైగా వృద్ధి చెంది 19,809 యూనిట్లు, ట్రాక్టర్ల విక్రయాలు 57.66 శాతం అధికమై 17,440 యూనిట్లకు చేరుకున్నాయి.  

మరిన్ని వార్తలు