డిపాజిటర్ల డబ్బు పరిరక్షణే పవిత్ర విధి

26 Sep, 2023 04:59 IST|Sakshi

బ్యాంకింగ్‌పై ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ స్పష్టీకరణ 

మతపరమైన స్థల సందర్శనల కంటే ముఖ్యమైనదని వ్యాఖ్య 

యూసీబీ డైరెక్టర్లను ఉద్దేశించి ప్రసంగం

ముంబై: డిపాజిటర్లు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించడం బ్యాంకర్‌కు పవిత్రమైన విధి అని, ఇది మతపరమైన స్థలాన్ని సందర్శించడం కంటే చాలా ముఖ్యమైనదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. చిన్న పొదుపుదారులు, మధ్యతరగతి, పదవీ విరమణ చేసిన వారి నుండి సమీకరించిన డిపాజిట్లపై మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థ  ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ డబ్బు పరిరక్షణే ప్రధాన పవిత్ర విధిగా భావించాలని ఆయన అన్నారు.

‘‘డిపాజిటర్ల డబ్బును రక్షించడం బ్యాంకు అతి ముఖ్యమైన బాధ్యత. ఇది పవిత్రమైన విధి. గుడి లేదా మసీదు లేదా గురుద్వారాకు నమస్కరించడం కంటే.. డిపాజిటర్ల సొమ్మును పరిరక్షించడం ఎంతో పవిత్రమైన విధి’’ దాస్‌ అన్నారు. బ్యాంకింగ్‌ రంగంలోని ప్రతి ఒక్కరిపై ఉన్న ‘‘అతిపెద్ద బాధ్యత ఇది’’ అని ఇక్కడ నిర్వహించిన అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు (యుసీబీ) డైరెక్టర్ల సమావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.  దాస్‌ ఆగస్టు 30వ తేదీన ఈ మేరకు చేసిన ఒక ప్రసంగాన్ని ఆర్‌బీఐ సోమవారం యూట్యూబ్‌లో  అప్‌డేట్‌ చేసింది.  ఆయన ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు...

► డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉందని నిర్ధారించడానికి అన్ని బ్యాంకులతో కలిసి పనిచేయడం రిజర్వ్‌ బ్యాంక్‌ బాధ్యత.  అందువల్ల ఈ దిశలో సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. నిబంధనలు, పర్యవేక్షణ చర్యలు కొనసాగుతూనే ఉంటాయి.   
► ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే... సహకార బ్యాంకింగ్‌ రంగంలో సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా డిపాజిటర్‌ సొమ్ము నిలిచిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో చాలా వరకూ నిర్వహణలో అక్రమాలే ప్రధాన కారణం. ఇక్కడ మనం యూసీబీ..  పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర బ్యాంక్‌ను ప్రస్తావించుకోవచ్చు.  
► 1,500 పైగా సంస్థలపై మెరుగైన నియంత్రణ, పర్యవేక్షణ చేయాలన్న ప్రధాన దృక్పథంతో యూసీబీల కోసం ఆర్‌బీఐ నాలుగు అంచెల పర్యవేక్షణా యంత్రాంగాన్ని రూపొందించింది.  ► ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థ స్థిరంగా ఉండాలి.  ఆర్థిక వ్యవస్థలో యూసీబీలు ముఖ్యమైన భాగం.  
► యూసీబీలపై ఆర్‌బీఐ పర్యవేక్షణను పటిష్టం చేయడాన్ని... ఆయా సంస్థలు తమ వృద్ధికి ఆటంకాలు కలిగించే ప్రయత్నంగా చూడవద్దు.  

యూసీబీల మొండిబకాయిలపై హెచ్చరిక
అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులలో  స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి (జీఎన్‌పీఏ)  8.7 శాతంగా ఉన్న విషయాన్ని గవర్నర్‌ ప్రస్తావిస్తూ, దీనిపట్ల సెంట్రల్‌ బ్యాంక్‌ ‘‘సౌఖ్యంగా లేదు’’ అని స్పష్టం చేశారు. షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల జీపీఎన్‌ఏలు 2023 మార్చిలో  దశాబ్దపు అత్యుత్తమ స్థాయి 3.9 శాతానికి చేరుకున్నాయని,  మరింత మెరుగుపడతాయన్న అంచనాలూ ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు.  ఎన్‌పీఏల సమస్యను మెరుగుపరచడానికి యూసీబీలూ తగిన కృషి చేయాలని కోరారు.

అలాగే యూసీబీలు పాలనా ప్రమాణాలను మెరుగుపరచాలని, డైరెక్టర్లు, అధికారుల వంటి బ్యాంకు నిర్వహణా సంబంధ పార్టీ లావాదేవీలను నివారించాలని, రుణ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆయన కోరారు. యూసీబీలు ఇటీవలి కాలంలో బహుళ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని దాస్‌ పేర్కొన్నారు. మున్ముందు యూసీబీ సెగ్మెంట్‌.. డిజిటల్, ఫిన్‌టెక్, నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు, సూక్ష్మ రుణదాతలు వంటి టెక్‌–అవగాహన సంస్థల నుండి తీవ్ర పోటీని ఎదుర్కొననుందని, అందువల్ల సాంకేతికతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని దాస్‌ చెప్పారు. అయితే ఈ రంగంలో కొన్ని బ్యాంకులు తగిన విధంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.  
 

మరిన్ని వార్తలు