రూపాయికి ‘విదేశీ’ బలం

25 Aug, 2020 08:10 IST|Sakshi

52 పైసలు అప్‌

74.32 వద్ద క్లోజ్‌

5 నెలల గరిష్టం

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో ఒకేరోజు 52 పైసలు పెరిగి, 74.32 వద్ద ముగిసింది. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి (మార్చి 18 తర్వాత). గడచిన ఒకటిన్నర నెలల్లో రూపాయి ఈ స్థాయిలో (52 పైసలు) పెరగడం ఇదే తొలిసారి.  దేశంలోకి కొనసాగుతున్న విదేశీ నిధుల ప్రవాహం, ఈక్విటీల పెరుగుదల వంటి అంశాలు దీనికి కారణం. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్‌లో ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్‌ బలహీన ధోరణి కూడా రూపాయి సెంటిమెంట్‌కు దోహదపడింది.   రూపాయి 74.91 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. అనంతరం మరింత బలపడింది. రోజంతా 74.31 గరిష్టం–74.91 కనిష్ట స్థాయిల మధ్య తిరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో అధికంగా ఉన్న లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) భారత్‌ వంటి వర్ధమాన మార్కెట్లలోకి వస్తోంది. ఆగస్టులో ఇప్పటి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ.41,330 కోట్లను భారత్‌ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టారు.   రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్‌ 16వ తేదీ). 

మరిన్ని వార్తలు