ఇది మాములు ఇల్లు కాదు.. దరిద్రపుగొట్టుది! అమ్మితే కోట్లు వచ్చాయి

19 Jan, 2022 18:37 IST|Sakshi

అది పోష్‌ ఏరియా. ఎటు చూసినా విలాసవంతమైన బంగ్లాలు.. ఖరీదైన కార్లు. కానీ, ఆ మధ్యలో దిష్టి చుక్కలాంటి ఓ చిన్న కొంప కనిపిస్తుంది. పైగా ఆ ఇంట్లో ఉండేవాళ్లకు దరిద్రం చుట్టుకుంటుందని, నష్టాలు-జబ్బులు జీవితాంతం వెంటాడుతాయనే ప్రచారం ఉంది. దీంతో ఆ ఇంటి వైపు భయపడిపోయేవాళ్లు ఇంతకాలం. అలాంటి కొంప ఇప్పుడు ఏకంగా మన కరెన్సీలో రూ.14 కోట్లకుపైగా అమ్ముడుపోయి.. స్థానికులను నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది.  


శాన్‌ ఫ్రాన్సిస్కోలోని(కాలిఫోర్నియా) నోయి వ్యాలీలో ఉంది రెండు వేల చదరపు ఫీట్ల విస్తీర్ణంలోని ఈ పాడుబడిన కొంప. దీనికి ఓనర్‌ ఎవరనేదానిపై క్లారిటీ లేదు. పైకి డొక్కు బిల్డింగ్‌లా.. లోపల మంచి ఫర్నీషింగ్‌, మోడ్రన్‌ సెటప్‌తో ఆశ్చర్యపరుస్తుంది.  122 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఇంట్లో..  రెండో ప్రపంచ యుద్ధ సమయం నుంచి కొందరు నివసించేవాళ్లట. బెడ్‌రూం లేకుండా ఒక బాత్‌రూం(అందులో బాత్‌టబ్‌), కిచెన్‌, చిన్న లివింగ్‌ రూం మాత్రమే ఉన్నాయి ఆ ఇంట్లో.  మొత్తం చెక్కతో నిర్మించిన ఈ ఇంటిలో ఎవరైనా నివసిస్తే..  వాళ్లను దురదృష్టం వెంటాడేదని నమ్ముతుంటారు.

అలా చాలాకాలం పాటు ఆ ఇల్లు ఖాళీగా ఉండిపోయింది. అంతెందుకు ఆ చుట్టుపక్కల కాస్ట్‌లీ ఇళ్లులు వెలిసినప్పటికీ.. ఆ ఇంటిని కూల్చే ధైర్యం మాత్రం ఎవరూ చేయలేకపోయారట. చివరికి ఓ పెద్దాయన ధైర్యం చేసి చాలాకాలం పాటు ఈ ఇంట్లో నివసించాడు. ఆయన నుంచి  కన్జర్వేటర్‌షిప్‌ కింద టాడ్‌ వెలీ అనే వ్యక్తి ఈ ఇల్లును చేజిక్కించుకుని.. వేలం పాట నిర్వహించాడు. 


కంపాస్‌ అనే బ్రోకరేజ్‌ వెబ్‌సైట్‌ నుంచి జనవరి 7వ తేదీన..  ఆరు లక్షల డాలర్లపై చిలుకు విలువతో వేలం మొదలైంది.  పాత కాలం నాటి ఇల్లు కావడం, పైగా దాని వెనుక ‘దరిద్రపుగొట్టు’ ప్రచారం ఈ  పాత ఇంటికి మంచి డిమాండ్‌ తెచ్చిపెట్టింది. రెండువేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఆ పాత ఇంటిని ఏకంగా 1.97 మిలియన్‌ డాలర్లు(మన కరెన్సీలో 14 కోట్ల రూపాయలకు పైనే) అమ్ముడుపోయింది. ‘పార్కింగ్‌ ప్లేస్‌ అంత లేదు.. అంత పెట్టి ఎవరు దక్కించుకున్నారు?’ అనే అనుమానాలు చాలా మందికి కలిగాయి. కానీ, గోప్యత కారణాలతో వేలంలో దక్కించుకున్న వ్యక్తి పేరు చెప్పడం లేదు టాడ్‌ వెలీ. అన్నట్లు ఆ ఇంటిని కూలగొట్టే ఉద్దేశంగానీ, రిన్నొవేషన్‌ చేసే ఉద్దేశంగానీ వేలంలో దక్కించుకున్న వ్యక్తికి లేవట!. మరి ఏం చేస్తాడో?.

చదవండి: 5జీతో విమానాలకు ప్రమాదం పొంచి ఉందా?

>
మరిన్ని వార్తలు