కొనసాగిన రికార్డులు

17 Aug, 2021 02:59 IST|Sakshi

ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డుల నమోదు

సెన్సెక్స్‌ లాభం 244 పాయింట్లు

నిఫ్టీకి ఆరోరోజూ లాభాలే  

ఆరంభ నష్టాల రికవరీ

రాణించిన మెటల్, ఆర్థిక షేర్లు

ఆటో, బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు

ముంబై: స్టాక్‌ మార్కెట్లో రికార్డుల పరంపర సోమవారమూ కొనసాగింది. మెటల్, ఆర్థిక షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం షేర్లు రాణించడంతో సూచీలు మూడోరోజూ ఇంట్రాడే, ముగింపులో సరికొత్త గరిష్టాలను నమోదుచేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 244 పాయింట్లు ఎగసి 55,681 వద్ద ఆల్‌టైం హై స్థాయిని అందుకుంది. చివరికి 145 పాయింట్ల లాభంతో 55,583 వద్ద ముగిసింది. నిఫ్టీ ట్రేడింగ్‌లో 60 పాయింట్లు పెరిగి 16,589 వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదుచేసింది. మార్కెట్‌ ముగిసే సరికి 34 పాయింట్ల లాభంతో 16,563 వద్ద స్థిరపడింది.

నిఫ్టీకిది ఆరోరోజూ, సెన్సెక్స్‌ మూడోరోజూ లాభాల ముగింపు. చిన్న, మధ్య తరహా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌ ఇండెక్స్‌లు అరశాతానికి పైగా నష్టపోయాయి. జూన్‌ త్రైమాసికపు ఫలితాలు మెప్పించడంతో పాటు ప్రపంచ మార్కెట్లోనూ ధరలు స్థిరంగా ఉండటంతో మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఒకటిన్నర శాతం ర్యాలీ లాభపడింది. ఆటో, ఐటీ, మెటల్, బ్యాంకింగ్‌ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ప్రభుత్వరంగ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. చైనా జూలై పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ గణాంకాలు నిరాశపరచడంతో పాటు కోవిడ్‌ వైరస్‌ విజృంభణతో అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. పార్శీ నూతన సంవత్సరం సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్‌ పని చేయలేదు

ఆరంభ నష్టాలు రికవరీ...
దేశీయ మార్కెట్‌ ఉదయం మిశ్రమంగా మొదలైంది. సెన్సెక్స్‌ 43 పాయింట్ల లాభంతో 55,480, నిఫ్టీ 11 పాయింట్ల పతనంతో 16,518 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకోవడంతో పాటు రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు మరింత అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. ఒకదశలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు, నిఫ్టీ 48 పాయింట్లను కోల్పోయాయి. ఈ సమయంలో జూన్‌ టోకు ధరల ద్రవ్యోల్బణ దిగివచ్చినట్లు కేంద్ర గణాంకాల శాఖ ప్రకటనతో సూ చీల నష్టాలకు అడ్డుకట్ట పడింది. మిడ్‌సెషన్‌ నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సూచీలు ఆరంభ నష్టాలను పూడ్చుకొని క్రమంగా లాభాలను మూటగట్టుకున్నాయి.

మార్కెట్లో మరిన్ని సంగతులు...  
► రిలయన్స్‌ – సౌదీ ఆరామ్‌కో వ్యాపార ఒప్పంద చర్చలు సఫలవంతం దిశగా సాగుతున్నట్లు వార్తలు వెలుగులోకి రావడంతో ఆర్‌ఐఎల్‌ షేరు ఒకటిన్నర శాతం లాభంతో రూ.2174 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రెండున్నర శాతం ర్యాలీ చేసి రూ.2203 వద్ద గరిష్టాన్ని తాకింది.  
► ఆర్థిక రంగ షేర్ల ర్యాలీ భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం షేర్లు రాణించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు అరశాతం లాభంతో రూ.1529 వద్ద, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ షేరు ఒకశాతం పెరిగి రూ.2,733 వద్ద స్థిరపడ్డాయి.
► వొడాఫోన్‌ ఐడియా షేరు ఆరుశాతం క్షీణించి రూ.6 వద్ద ముగిసింది. కంపెనీ రెండో త్రైమాసికంలో భారీ నష్టాలను నమోదు చేయడం షేరు పతనానికి కారణమైంది.
► పలు బ్రోకరేజ్‌ సంస్థలు షేరు టార్గెట్‌ ధరను పెంచడంతో టాటా స్టీల్‌ షేరు నాలుగుశాతం లాభపడి రూ.1519 వద్ద ముగిసింది.  
► జూన్‌ క్వార్టర్‌లో రూ.729 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించడంతో స్పైస్‌జెట్‌ షేరు నాలుగు శాతం నష్టంతో రూ.69 వద్ద స్థిరపడింది.

మరిన్ని వార్తలు