లాభాలతో షురూ- సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ

4 Nov, 2020 09:32 IST|Sakshi

211 పాయింట్లు అప్‌-40,472కు సెన్సెక్స్‌ 

52 పాయింట్ల లాభంతో 11,865 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

ఐటీ, మీడియా, ఫార్మా, మెటల్ అప్‌

ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రియల్టీ వీక్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం అప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 211 పాయింట్లు జంప్‌చేసి 40,472కు చేరగా.. నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 11,865 వద్ద ట్రేడవుతోంది. డెమొక్రాట్‌ అభ్యర్థి జోబిడెన్‌ విజయంపై అంచనాలతో మంగళవారం యూఎస్‌ మార్కెట్లు 2 శాతం ఎగశాయి. బిడెన్‌ గెలిస్తే భారీ సహాయక ప్యాకేజీకి ఆమోదముద్ర పడగలదన్న అంచనాలు ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,478 వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,108 వద్ద కనిష్టం నమోదైంది.

బ్యాంక్స్‌ డీలా
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ 2.3 శాతం లాభపడగా.. మీడియా, ఫార్మా, మెటల్‌ 1.4-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే రియల్టీ, బ్యాంక్‌ నిఫ్టీ 0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా, అదానీ పోర్ట్స్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ 3.3-1.3 శాతం మధ్య ఎగశాయి. అయితే పవర్‌గ్రిడ్‌, యూపీఎల్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, బజాజ్‌ ఆటో, ఐషర్‌, ఎయిర్‌టెల్‌, గ్రాసిమ్‌, ఐటీసీ 2.2-0.6 శాతం మధ్య డీలాపడ్డాయి.

పీవీఆర్‌ జూమ్‌
డెరివేటివ్స్‌లో పీవీఆర్‌, కోఫోర్జ్‌, మైండ్‌ట్రీ, అపోలో టైర్‌, భారత్‌ ఫోర్జ్‌, జిందాల్‌ స్టీల్‌, ఐజీఎల్‌, టాటా కన్జూమర్‌ 7-1.3 శాతం మధ్య వృద్ధి చూపాయి. కాగా.. మరోపక్క ఫెడరల్‌ బ్యాంక్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, బీవోబీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌, అశోక్‌ లేలాండ్‌, పీఎఫ్‌సీ, పీఎన్‌బీ 1.6-1 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 861 లాభపడగా.. 555 నష్టాలతో కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు