చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు సిడ్బీ సాయం

17 Oct, 2023 06:32 IST|Sakshi

బ్యాంక్‌ల నుంచి నిధుల మద్దతు

వృద్ధి వేగాన్ని పెంచే కార్యక్రమం

ముంబై: చిన్న ఎన్‌బీఎఫ్‌సీల వృద్ధిని వేగవంతం చేసేందుకు చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్‌ (సిడ్బీ) ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. తద్వారా బ్యాంక్‌ల నుంచి నిధుల పొందే అర్హతను వాటికి కలి్పంచనుంది. ఈ కార్యక్రమంలో తొలుత 18 చిన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను (ఎన్‌బీఎఫ్‌సీలు) చేర్చింది. చిన్న ఎన్‌బీఎఫ్‌సీలు మరింత విస్తరించేందుకు వీలుగా, వాటి అర్హతలను పెంచేందుకు ఐదు నెలల కార్యక్రమాన్ని రూపొందించినట్టు సిడ్బీ చైర్మన్, ఎండీ శివసుబ్రమణియన్‌ రామన్‌ తెలిపారు. రిస్క్, కార్యకలాపాలు, పరిపాలన, టెక్నాలజీ తదితర అంశాల్లో నిపుణుల మార్గదర్శకత్వాన్ని వాటికి అందించనున్నట్టు చెప్పారు.

దేశంలో 8 కోట్ల చిన్న వ్యాపార సంస్థలు ఉంటే, కేవలం 15 శాతం వాటికే సంఘటిత మార్కెట్‌ (ఇనిస్టిట్యూషన్స్‌) నుంచి రుణ సాయం అందుతున్నట్టు రామన్‌ తెలిపారు. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) రుణ వితరణ విభాగంలో భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. గడిచిన మూడేళ్లలో ఎంఎస్‌ఎంఈలకు సిడ్బీ రుణ వితరణ రూ.50,000 కోట్ల మార్క్‌ను అధిగమించినట్టు తెలిపారు. వ్యవస్థ మొత్తం మీద ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి రూ.25 లక్షల కోట్ల రుణ పుస్తకం ఉండగా, వచ్చే రెండేళ్లలో రెట్టింపు అవుతుందన్నారు. ఇప్పుడున్న ఎంఎస్‌ఎంఈ రుణాల్లో కేవలం 28 శాతమే ఎన్‌బీఎఫ్‌సీలు సమకూర్చినవిగా తెలిపారు. తాము చేపట్టిన కార్యక్రమంలో భాగంగా.. ఎంఎస్‌ఎంఈలు ప్రధాన లక్ష్యంగా పనిచేసే ఎన్‌బీఎఫ్‌సీలకు సంఘటిత మార్కెట్‌ నుంచి నిధులు పొందే అర్హతను కలి్పంచడం ప్రధాన లక్ష్యమని రామన్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు