సరికొత్త గరిష్ఠాల్లో మార్కెట్లు.. వచ్చే వారం ఎలా ఉండనుందంటే..

16 Dec, 2023 12:00 IST|Sakshi

మార్కెట్‌ ఇప్పటికే ఆల్‌టైమ్‌హైలో ఉంది. ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి పెరుగుతుందా.. ఫెడ్‌ కీలక వడ్డీరేట్లు తగ్గించనుందనే సంకేతాలతో రానున్న రోజుల్లో మార్కెట్‌ ఎలా స్పందిస్తుంది.. వచ్చేవారం మార్కెట్‌ వైఖరి ఎలా ఉండబోతుంది.. వంటి అంశాలపై ప్రముఖ స్టాక్‌మార్కెట్‌ అనలిస్ట్‌ కారుణ్యరావు మాట్లాడారు.

మార్కెట్‌ ఆల్‌టైమ్‌హైను చేరింది. దాంతో కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఇన్వెస్టర్లు కొంత ఆందోళన చెందుతారు. కానీ చాలా కాలంగా మార్కెట్‌లో ఉంటున్నవారు అంతగా కంగారుపడి ఇక్కడి నుంచి మార్కెట్‌ తగ్గుతుందేమోనని స్టాక్‌లను విక్రయించే ప్రయత్నం చేయరు. అయితే నిజంగా మార్కెట్‌ ఇంతలా పెరిగినపుడు కొంత కరెక్షన్‌ రావొచ్చు. కానీ గతంలోలాగా చాలా తగ్గిపోతుందనే సంకేతాలు మాత్రం ప్రస్తుతానికి లేవు. నిజంగా మార్కెట్లు తగ్గుతాయనే లాజిక్‌ ఉంటే కొనుగోలు, విక్రయంపై నిర్ణయం తీసుకోవాలి. కానీ ఎలాంటి అవగాహన లేకుండా, సరైన కారణం లేకుండా మార్కెట్‌లో పొజిషన్‌ తీసుకోవడంతో నష్టపోవాల్సి ఉంటుంది.

ఫెడరల్‌ రిజర్వ్‌బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లు తగ్గుస్తుందనే సంకేతాలు ప్రధానంగా ఐటీ కంపెనీలకు బలం చేకూర్చాయి. దాంతో ఫెడ్‌ నిర్ణయం వెలువడిన తర్వాత ఐటీ స్టాక్‌ల్లో భారీగా ర్యాలీ కనిపించింది. అయితే క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఈసారి కూడా కొన్ని దిగ్గజ ఐటీ కంపెనీలు ఊహించిన ఫలితాలు ప్రకటించకపోవచ్చు. దాంతో కంగారుపడి మంచి కంపెనీ స్టాక్‌లు అమ్మేయకుండా పడిన ప్రతిసారి ఎస్‌ఐపీ విధానంలో కొంతమేర కొనుగోలు చేయాలి.

ఫెడ్‌ వడ్డీరేట్లు పెంచుతుందేమోననే భయాలతో ఐటీ సెక్టార్‌ చాలా కరెక్ట్‌ అయింది. కానీ ప్రస్తుతం వస్తున్న సానుకూల వార్తలతో కొంత ఒడుదొడుకులు ఎదురైనా భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్కెట్‌లో అధిక వెయిటేజీ ఉన్న ఐటీస్టాక్‌లు ఇటీవల భారీగా ర్యాలీ అవుతుండడంతో ఇండెక్స్‌ కూడా పెరిగింది. మేజర్‌ ఐటీస్టాక్‌లు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవశాశం ఉంది. దాంతో మార్కెట్లు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

2026 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించనుందని నిపుణులు చెబుతున్నారు. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ  అప్పటికి 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. 2027లో 5.5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని చెబుతున్నారు. అదే జరిగితే ఇండియన్‌ స్టాక్‌మార్కెట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని ఎప్పుడు సడలిస్తాయోనని మదుపరులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను చాలాకాలంగా స్థిరంగా ఉంచుతోంది. ఇదికూడా మార్కెట్‌ పెరిగేందుకు దోహదం చేస్తోంది. చమురు మార్కెట్, ఓపెక్‌ ప్లస్‌ దేశాల సరఫరా నిర్ణయాలను పరిశీలిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

>
మరిన్ని వార్తలు