సాక్షి మనీ మంత్ర: ఒడుదొడుకులతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

22 Dec, 2023 10:00 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ సూచీలు లాభ, నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి.

ఉదయం 9:40 సమయానికి సెన్సెక్స్‌ 191 పాయింట్లు లాభంతో 71,050 వద్ద వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 21,337 దగ్గర ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.25 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటన్‌, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అమెరికా మార్కెట్‌ సూచీలు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు అదే బాటలో పయనిస్తున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు గురువారం రూ.1,636 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.1,464 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ఎర్ర సముద్రంలో నెలకొన్న అలజడి నేపథ్యంలో చమురు ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 0.93 శాతం పెరిగి 80 డాలర్లకు చేరింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

>
మరిన్ని వార్తలు