మరింత ప్రమాదకరంగా 2024..? | Sakshi
Sakshi News home page

మరింత ప్రమాదకరంగా 2024..?

Published Thu, Dec 21 2023 5:08 PM

Everything Bubble Across Stocks Markets Crash - Sakshi

స్టాక్‌మార్కెట్‌లో చాలా మంది ఇన్వెస్టర్ల​ పోర్ట్‌ఫోలియోలు లాభాల్లోకి వెళ్లక దాదాపు సంవత్సరం దాటింది. ఇటీవల మార్కెట్‌ కాస్త పుంజుకుని ఆల్‌టైమ్‌హైని చేరింది. దాంతో రానున్న ఏడాదిలో లాభాలు వస్తాయేమోననే ఆశలు చిగురించాయి. దానికితోడు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో 2024 కొంత ఆశాజనకంగా ఉంటుందనే వాదనలు వచ్చాయి. కానీ అందుకు భిన్నంగా రానున్న ఏడాదిసైతం నష్టాల తిప్పలు తప్పవని, గతంలో కంటే మరింత తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొత్త సంవత్సరంలో అత్యంత ప్రమాదకరమైన మార్కెట్ క్రాష్‌ రాబోతోందని ఆర్థికవేత్త హ్యారీ డెంట్ ఇటీవల హెచ్చరించారు. ఈ క్రమంలో పెట్టుబడిదారులు తమ ఆర్థిక సలహాదారులను నమ్మకూడదని కోరారు. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత పెరిగిన మార్కెట్లు ప్రస్తుతం ఓవర్ వ్యాల్యుయేషన్లకు చేరుకున్నందున కుప్పకూలుతాయని జోష్యం చెప్పారు.

అయితే ఈసారి వచ్చే మార్కెట్‌ క్రాష్ 1929-1932లో వచ్చిన మాంధ్యం తీవ్రతతో సమానంగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఈ క్రమంలో ఎస్‌ అండ్‌ పీ500లో 86%, నాస్‌డాక్‌లో 92%, క్రిప్టో మార్కెట్‌ 96% కుప్పకూలే ప్రమాదం ఉందని డెంట్ సూచిస్తున్నారు. ఇలాంటి క్రమంలో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను లాభాల్లో ఉన్నప్పుడే విక్రయించటం వల్ల గణనీయమైన నష్టాలను నివారించవచ్చని తెలిపారు. అలాగే భవిష్యత్తులో షేర్ల ధరలు క్షీణించినప్పుడు పెట్టుబడి పెట్టి లాభాలను పొందేందుకు మంచి అవకాశమని సలహా ఇచ్చారు.

ఇదీ చదవండి: ‘బ్యాడ్‌ బ్యాంక్‌’లు మంచివే..?

అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వచ్చే ఏడాది కీలక వడ్డీరేట్లను తగ్గించాలని యోచిస్తున్నట్లు ఇటీవల జరిగిన సమావేశాల ఆధారంగా తెలుస్తోంది. అయితే ఇలా రేట్ల తగ్గిస్తూ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలనే చర్యలను మానుకోవాలని డెంట్ అన్నారు. దీని కారణంగా తేలికపాటి మాంధ్యం అంచనాలకు విరుద్ధంగా.. తీవ్ర ద్రవ్యోల్బణంతో ఆర్థికమాంధ్యానికి దారితీస్తుందన్నారు. ఈ ఆర్థికవేత్త 1989లో జపాన్‌లో జరిగిన ‘బబుల్ బర్స్ట్’, అమెరికా డాట్-కామ్ బబుల్, డోనాల్డ్ ట్రంప్ విజయం వంటి కీలక అంచనాలు నిజమయ్యాయి. అయితే ఇదే క్రమంలో కొందరు ఆర్థిక వ్యూహకర్తలు, గోల్డ్‌మన్ సాక్స్‌ వంటి పెట్టుబడి సంస్థలు అమెరికా ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ల‌పై బుల్లిష్‌గానే ఉన్నాయి.

Advertisement
Advertisement