Sudha Murty: ఇన్ఫోసిస్‌ డైరెక్టర్‌గా రిటైరయ్యేదాన్ని..

2 Mar, 2024 21:54 IST|Sakshi

దేశంలో అత్యంత గుర్తింపు పొందిన దంపతుల్లో ఇన్ఫోసిస్‌ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, సుధా మూర్తి ఒకరు. దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషితో నారాయణమూర్తి ప్రసిద్ధి చెందితే రచయిత్రిగా, సేవా కార్యక్రమాలతో ఆయన సతీమణి సుధా మూర్తి గుర్తింపు పొందారు. అయితే భర్త కంపెనీ కోసం ఎంతో కష్టపడిన ఆమె కంపెనీలో మాత్రం భాగం కాలేకపోయారు. దానికి తన భర్త పెట్టిన షరతే కారణమంటున్నారు సుధా మూర్తి.

అనేక దశాబ్దాల సహచర్యం ఉన్న ఈ దంపతులు తమ జీవిత విశేషాల గురించి పలు సందర్భాల్లో పంచుకుంటుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుధా మూర్తి తన భర్తతో సాన్నిహిత్యాన్ని, తమ వైవాహిక బంధం గురించి వెల్లడించారు.తమ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత ఒత్తిడితో కూడిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు.

"నేను కంపెనీ (ఇన్ఫోసిస్)లో చేరలేకపోవడమే జీవితంలో నాకు అత్యంత కష్టతరమైన విషయం. నేను ఎందుకు చేరలేకపోయానంటే.. కంపెనీ భార్యాభర్తల కంపెనీ కాకూడదని ఆయన షరతు పెట్టారు. ఆ కష్టతరమైన సమయం నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పట్టింది. నేను ఎంతగానో ప్రేమించిన కంపెనీ, దాని కోసం చాలా పనిచేశాను. కానీ అందులో భాగం కాలేకపోయాను" అన్నారు సుధామూర్తి.

అయినప్పటికీ తాను జీవితంలో సంతోషంగా ఉన్నానని ఆమె చెప్పారు. ‘ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పటికి నేను బహుశా ఇన్ఫోసిస్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసి ఉండేదాన్ని. కానీ నేను నా పనితో చాలా మంది జీవితాలను స్పృశించగలిగాను. బహుశా ఇది దేవుడి నిర్ణయం. నాకు మాత్రమే సాధ్యమైంది" అన్నారు.

నారాయణ మూర్తి, సుధామూర్తి చేసిన ఎన్నో త్యాగాల ఫలితమే ఈ రోజు దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించిన ఇన్ఫోసిస్. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కంపెనీ వృద్ధి కోసం తమ మూడు నెలల పాపకు దూరంగా ఉండాల్సి వచ్చినట్లు సుధామూర్తి పేర్కొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు