ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్‌లోకి ఫాక్స్‌కాన్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 750 కిలోమీటర్లు జర్నీ!

20 Oct, 2021 13:49 IST|Sakshi

Taiwan Foxconn EV India: ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్‌, క్రేజ్‌ పెరుగుతున్న తరుణంలో పలు కంపెనీలు ఆటోమొబైల్‌ రంగం వైపు అడుగులు వేస్తున్నాయి. తాజాగా మరో దిగ్గజ కంపెనీ ఈవీ తయారీలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించింది.   


తైవాన్‌ టెక్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి అడుగుపెట్టనున్నట్లు అనౌన్స్‌ చేసింది. ఈ మేరకు బుధవారం ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ లీయూ యంగ్‌ వే స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశారు. జర్మన్‌ ఆటోమేకర్స్‌ పరోక్ష సహకారంతో ఈ వాహనాల ఉత్పత్తిని మొదలుపెట్టనున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు సోమవారం మూడు కార్ల నమునాను సైతం లీయూ, తైపీలో జరిగిన ఓ ఈవెంట్‌లో ప్రదర్శించారు. భారత దేశంతో పాటు యూరప్‌, లాటిన్‌ అమెరికా ఖండాల్లో ఈవీ వాహనాల తయారీని చేయనున్నట్లు ప్రకటించారాయన. ఇటలీ సంస్థ పినిన్‌ఫార్నియా డెవలప్‌ చేస్తున్న ‘ఇ సెడాన్‌’ మోడల్‌ను 2023లో విడుదల చేయనున్నట్లు, ఐదు సీట్లు కలిగిన ‘మోడల్‌ ఇ’ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 750 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని కంపెనీ చెబుతోంది.

అయితే జర్మన్‌ టెక్నాలజీ నేపథ్యంలో తమ తొలి ప్రాధాన్యం యూరప్‌గానే ఉంటుందన్న లీయూ, ఆ తర్వాతి ప్రాధాన్యం మాత్రం భారత్‌లోనేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తైవాన్‌కు చెందిన హోన్‌ హాయ్‌ ప్రెసిషన్‌ కంపెనీ.. ఎలక్ట్రిక్ గూడ్స్‌ తయారీలో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ట్యూచెంగ్‌ కేంద్రంగా అంతర్జాతీయంగా 13 లక్షల ఉద్యోగులతో భారీ మార్కెట్‌ను విస్తరించుకుంది. అంతేకాదు తైవాన్‌లో యాపిల్‌ ప్రొడక్టులకు సప్లయర్‌గా ఉంది. 


 

క్లిక్‌ చేయండి: ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి గుడ్‌న్యూస్‌ 

మరిన్ని వార్తలు