‘సాహో’ రతన్‌ టాటా!.. టాటా గ్రూప్‌ మరో సంచలనం..

19 Feb, 2024 16:49 IST|Sakshi

టాటా గ్రూప్‌ కంపెనీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. టాటా గ్రూప్ కంపెనీల విలువ దాయాది దేశం పాకిస్తాన్‌ జీడీపీని దాటిందని ఎకనమిక్స్‌ టైమ్స్‌ (ET) నివేదించింది. 

ఎకనమిక్స్‌ టైమ్స్‌ రిపోర్ట్‌ ప్రకారం.. సాల్ట్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ రంగాల వరకు తన సర్వీసుల్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న టాటా గ్రూప్‌ కంపెనీల అన్నీ స్టాక్స్‌ గత ఏడాది నుంచి ఊహించని లాభాల్ని గడిస్తున్నాయి. ఫలితంగా టాటా గ్రూప్‌ కంపెనీల మొత్తం విలువ పాకిస్తాన్‌ జీడీపీని అధిగమించిందని పేర్కొంది. 

ఐఎంఎఫ్‌ గణాంకాల ప్రకారం..
టాటా గ్రూప్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ వ్యాల్యూ సుమారు 365 బిలియన్‌ డాలర్లు. అంటే భారత్‌ కరెన్సీలో అక్షరాల రూ.30లక్షల కోట్లు. ఐఎంఎఫ్‌ గణాంకాల ప్రకారం.. పాకిస్తాన్‌ జీడీపీ 341 బిలియన్‌ డాలర్లు. 

టీసీఎస్‌ హవా
స్టాక్‌ మార్కెట్‌లో లిస్టైన టాటా గ్రూప్‌ మొత్తం కంపెనీల్లో టీసీఎస్‌ విలువ సుమారు 15లక్షల కోట్లుగా ఉంది. ఈ మొత్తం టీసీఎస్‌ విలువ పరిమాణం పాకిస్తాన్‌ ఎకానమీలో దాదాపూ సగం ఉంది.  ప్రస్తుతం పాక్‌ ఆర్ధిక వ్యవస్థ అప్పుల్లో కూరుకుపోవడం అందుకు కారణమని తెలుస్తోంది. 

సత్తా చాటిన మల్టీ బ్యాగర్‌ స్టాక్స్‌
అన్ని టాటా గ్రూప్ కంపెనీలు తమ మెరుగైన పనితీరుతో మార్కెట్ విలువ పెరుగుదలకు దోహదపడగా, టాటా మోటార్స్, ట్రెంట్‌లు మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఆకట్టుకున్నాయి. టాటా మోటార్స్ షేర్లు కేవలం ఏడాది వ్యవధిలో 110 శాతం పెరగ్గా, ట్రెంట్ 200 శాతం భారీగా లాభపడింది. ఇది టాటా టెక్నాలజీస్, టీఆర్‌ఎఫ్, బెనెరాస్ హోటల్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా మోటార్స్, ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా, ఆర్ట్‌సన్ ఇంజినీరింగ్ స్టాక్స్‌ పనితీరు కంటే మెరుగ్గా రాణించాయి.   

25కి పైగా లిస్టెడ్‌ కంపెనీలు 
కాగా, పలు నివేదిక ప్రకారం.. టాటా గ్రూప్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టైన కంపెనీలు కనీసం 25 ఉన్నాయి. వాటిలో టాటా కెమికల్స్ పనితీరు కారణంగా దాని విలువ 5 శాతం మాత్రమే తగ్గింది.

అన్‌లిస్టెడ్‌ కంపెనీల జాబితాలో 
టాటా గ్రూప్‌లో టాటా సన్స్, టాటా క్యాపిటల్, టాటా ప్లే, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎయిరిండియాతో సహా అనేక అన్‌లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యాపారాలను పరిగణనలోకి తీసుకుంటే టాటా గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయమైన పెరుగుదలను చూస్తుంది.  వచ్చే ఏడాది ఐపీఓకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న  టాటా క్యాపిటల్‌ అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో దాదాపు రూ. 2.7 లక్షల కోట్ల విలువను కలిగి ఉంది.

whatsapp channel

మరిన్ని వార్తలు