ట్యాక్స్‌ చెల్లిస్తున్నారా? పన్ను భారం ఇలా తగ్గించుకోండి!

23 Jan, 2023 06:55 IST|Sakshi

ఫిబ్రవరి 1న పార్లమెంటులో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఒక పక్క విశ్వవ్యాప్తంగా తరుముకొస్తున్న ఆర్థిక మాంద్యం, మరో పక్క అన్ని రంగాల్లో ధరల పెరుగుదల.. పది రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏవో తాయిలాలు ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తున్న వేతన జీవులు .. ఏవేవో ఊహాగానాలు.. ఏమి అవుతుందో తెలీదు..ఏం వస్తుందో తెలీదు. కానీ, ఏ మార్పూ రాదనుకుని వేతన జీవులు పన్ను భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం మీద దృష్టి సారిస్తే.. అదే ఊరట.. ఉపశమనం.. ఉత్తమం! 
 
గవర్నమెంటు ఉద్యోగస్తుల విషయంలో జీతభత్యాలు, అలవెన్సులు, షరతులు, నిబంధనలు, రూల్సు, నియమాలు మారవు. మీ మాట చెల్లదు. కానీ ప్రైవేట్‌ సంస్థల్లో కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. ఆ వెసులుబాటుతో ట్యాక్స్‌ ప్లానింగ్‌ చేసుకోవచ్చు. 

►కరువు భత్యం, కరువు భత్య అలవెన్సు .. ఈ రెండింటిని బేసిక్‌ జీతంలో కలిసిపోయేలా ఒప్పందం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇంటద్దె అలవెన్సు, గ్రాట్యుటీ, పెన్షన్‌ కమ్యుటెడ్‌ మీద పన్ను భారం తగ్గుతుంది. 

►జీతం మీద నిర్ణయించిన కమీషన్‌ శాతం .. ఫిక్సిడ్‌గా ఉండాలి. కమీషన్‌ని జీతంలో భాగంగా పరిగణిస్తారు. 

►యజమాని సహకరిస్తే కొన్ని చెల్లింపులను బిల్లులు సబ్మిట్‌ చేసి తీసుకోండి. అంటే.. రీయింబర్స్‌మెంటులాగా. 

►పెర్క్స్‌ని తీసుకుని లబ్ధి పొందడం చాలా ఉపయోగం. అలవెన్సులు వద్దు. వాటి మీద పన్ను భారం ఉంటుంది. 

►పెర్క్స్‌ అంటే .. ఇంట్లో టెలిఫోన్, ఇంట్లో కంప్యూటర్, పర్సనల్‌ ల్యాప్‌టాప్, కొన్ని చరాస్తులను ఇంట్లో వాడుకోవడం.. ఆఫీసులో పనివేళలో రిఫ్రెష్‌మెంట్లు.. మొదలైనవి.  వీటి మీద పన్ను భారం ఉండదు.
 
►ఆఫీసు కారు మీ స్వంత పని మీద వాడుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. అలా అని దుర్వినియోగం చేయవద్దు. 

►మీ యజమాని మీ తరఫున చెల్లించే పీఎఫ్‌ చందా 12 శాతం వరకు ఇవ్వొచ్చు.  

►80సీ సేవింగ్స్‌ మీ ఇష్టం.. మీ వీలును బట్టి చేయండి. 

►హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు కావాలంటే ఇల్లు మీ పేరు మీద కాకుండా, ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద క్లెయిమ్‌ చేయండి. వారు అసలు ట్యాక్స్‌ బ్రాకెట్‌లో లేకపోతే మీకు ఎంతో ప్రయోజనం. 

►ఎరియర్స్‌ జీతాలు చేతికి వచ్చినప్పుడే పన్నుభారం లెక్కిస్తారు. ఫిబ్రవరి 1 నాడు బడ్జెట్‌ వస్తోంది. 01–04–2023 నుంటి శ్లాబులు మారతాయి అని అంటున్నారు. అలా మారడం వల్ల ఉపయోగం ఉంటే ఎరియర్స్‌ను వచ్చే ఏడాది ఇవ్వమనండి. 

►కొన్ని కంపెనీల్లో వారికి మీ సేవలు కావాలి. మీ హోదా.. అంటే మీరు ఉద్యోగా? కన్సల్టెంటా అన్నది ముఖ్యం కాదు. అలాంటప్పుడు కన్సల్టెంటుగా ఉండండి. అప్పుడు 10 శాతం పన్ను డిడక్ట్‌ చేస్తారు. మీ ఖర్చుల్ని బట్టి మీ నికర ఆదాయాన్ని మీరే లెక్కించుకోవచ్చు.

మరిన్ని వార్తలు