ఆస్తి పన్ను స్వీయ మదింపు అక్రమాలకు చెక్‌ ?

15 Aug, 2021 09:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అనధికార/అనుమతి లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం కొందరు అక్రమార్కులు ఆస్తి పన్నుల స్వీయ మదింపు (సెల్ఫ్‌ అసెస్మెంట్‌) ప్రక్రియను దుర్వినియోగపరుస్తుండడాన్ని రాష్ట్ర పురపాలక శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ అక్రమాలను అడ్డుకునే దిశగా చర్యలు చేపట్టింది.

ఆస్తిపన్ను పేరు చెప్పి
అక్రమ లేఅవుట్లు/ ప్లాట్లకు చెక్‌ పెట్టేందుకు కనీసం ఒకసారి రిజిస్టర్‌ అయిన ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అనుమతి లేని ప్లాట్లను కొందరు అక్రమార్కులు గృహాలు/భవనాలుగా పేర్కొంటూ, వాటికి ఆస్తి పన్నుల స్వీయ మదింపు నిర్వహిస్తున్నారు. తద్వారా వచ్చిన ఆస్తి పన్ను నంబర్‌ ఆధారంగా వాటికి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. దీనిపై పురపాలక శాఖకు ఫిర్యాదులు కూడా అందాయి. వాస్తవానికి ఆన్‌లైన్‌లో ఆస్తి పన్ను స్వీయ మదింపు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఆటోమెటిక్‌గా ప్రాపర్టీ ట్యాక్స్‌ నంబర్‌తో కూడిన ఆస్తి పన్ను డిమాండ్‌ నోటీసును ప్రింట్‌ చేసుకోవడానికి పురపాలక శాఖే అవకాశం కల్పించింది. అయితే ఈ డిమాండ్‌ నోటీసులోని ఆస్తి పన్ను నంబర్‌ ఆధారంగా అక్రమ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఫిర్యాదుల నేపథ్యంలో పురపాలక శాఖ గుర్తించింది.  

15 రోజుల తర్వాతే ప్రింట్‌
అక్రమాలకు చెక్‌ పెట్టేలా ఇకపై ఆస్తి పన్నుల స్వీయ మదింపు పూర్తి చేసిన 15 రోజుల తర్వాతే డిమాండ్‌ నోటీస్‌ ప్రింట్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆ 15 రోజుల్లోగా సంబంధిత పురపాలికల అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవ స్థితిని నిర్థారించుకోనున్నారు. అలా నిర్ధారించుకున్న తర్వాతే ఆస్తి పన్ను డిమాండ్‌ నోటీస్‌ను ప్రింట్‌ చేసుకునేలా అవకాశం కల్పించనున్నామని పురపాలకశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు మార్గదర్శకాలను త్వరలోనే అన్ని పురపాలికలకు జారీ చేయనున్నామని చెప్పారు.    
 

మరిన్ని వార్తలు