పెట్టుబడులకు టెమాసెక్‌ ఆసక్తి

8 Dec, 2023 04:38 IST|Sakshi

దేశీ పర్యటనలో బోర్డు డైరెక్టర్లు

మూడేళ్లలో భారీ పెట్టుబడులు

ముంబై: గ్లోబల్‌ పెట్టుబడుల దిగ్గజం టెమాసెక్‌.. దేశీయంగా పెట్టుబడులపై మరోసారి దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా సింగపూర్‌ సంస్థ బోర్డు డైరెక్టర్లు దేశీయంగా పర్యటనకు వచి్చనట్లు తెలుస్తోంది. ఓవైపు దేశీ స్టాక్‌ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను తాకడం, మరోపక్క రాజకీయ స్థిరత్వ పరిస్థితులు ఇందుకు కారణమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత్‌ వెలుగుతున్న నేపథ్యంలో 11మంది సభ్యులుగల టెమాసెక్‌ బోర్డు దేశీయంగా పెట్టుబడులపై అత్యంత ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. రానున్న మూడేళ్ల కాలంలో 10 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేసే వ్యూహంతో టెమాసెక్‌ ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ, ముంబైలలో పారిశ్రామికవేత్తలు, కార్పొరేషన్లు, సీనియర్‌ ప్రభుత్వ అధికారులతో సమావేశంకానున్నట్లు తెలుస్తోంది.

సగటున 1.5 బిలియన్‌ డాలర్లు
దాదాపు గత రెండు దశాబ్దాలలో టెమాసెక్‌ సగటున ఏడాదికి 1–1.5 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేస్తూ వచ్చింది. ఈ బాటలో ప్రస్తుతం పెట్టుబడులను మూడు రెట్లు పెంచే యోచనలో ఉంది. ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు దేశీయంగా పెట్టుబడులకు తరలి వస్తున్న నేపథ్యంలో టెమాసెక్‌ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలలో అధికార బీజేపీ విజయం సాధించడంతో పాలసీలు కొనసాగనున్నట్లు విదేశీ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.

దీనికితోడు ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికం(జులై–సెపె్టంబర్‌)లో దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ) పటిష్ట వృద్ధిని సాధించడం జత కలుస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో హెల్త్‌కేర్‌ రంగంలోని మణిపాల్‌ హాస్పిటల్స్‌లో 2 బిలియన్‌ డాలర్లకుపైగా వెచ్చించి టెమాసెక్‌ మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. ఇది భారీ డీల్‌కాగా.. ఇప్పటికే ఓలా, జొమాటో, డాక్టర్‌ అగర్వాల్స్‌ హెల్త్‌కేర్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్, క్యూర్‌ఫిట్‌ తదితరాలలో ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు