ఐపీవో.. హాట్‌ కేక్‌ - తొలి రోజే మంచి స్పందన

23 Nov, 2023 07:43 IST|Sakshi

దేశీ స్టాక్‌ మార్కెట్లు హెచ్చుతగ్గులు చవిచూస్తున్నప్పటికీ ఇటీవల ప్రైమరీ మార్కెట్లు కొత్త ఇష్యూలతో కళకళలాడుతున్నాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతుండటంతో పలు కంపెనీలు లిస్టింగ్‌ బాట పడుతున్నాయి. తాజాగా టాటా టెక్నాలజీస్, గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ, ఫ్లెయిర్‌ రైటింగ్‌ ఇండస్ట్రీస్‌ పబ్లిక్‌ ఇష్యూలు ప్రారంభంకాగా.. తొలి రోజే అధిక స్థాయిలో స్పందన లభించడం గమనార్హం! వివరాలు ఇలా..

టాటా టెక్నాలజీస్‌
ఇంజనీరింగ్, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ డిజిటల్‌ సర్వీసుల టాటా గ్రూప్‌ కంపెనీ టాటా టెక్నాలజీస్‌ ఐపీవో తొలి రోజే అధిక సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో ప్రారంభమైన వెంటనే భారీగా బిడ్స్‌ దాఖలయ్యాయి. షేరుకి రూ. 475–500 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 6.5 రెట్లు అధికంగా స్పందన నమోదైంది. కంపెనీ 4.5 కోట్లకుపైగా షేర్లను ఆఫర్‌ చేయగా.. 29.43 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. వెరసి 24న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 3,043 కోట్లవరకూ అందుకోనుంది. 

టీసీఎస్‌(2004) తదుపరి రెండు దశాబ్దాలకు టాటా గ్రూప్‌ నుంచి వస్తున్న ఐపీవోకాగా.. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్‌) విభాగంలో 4 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 11.7 రెట్లు, రిటైలర్ల నుంచి 5.4 రెట్ల చొప్పున బిడ్స్‌ దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా మంగళవారం(21న) యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 791 కోట్లు సమీకరించిన విషయం విదితమే. మొత్తం 6.08 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. వీటిలో మాతృ సంస్థ టాటా మోటార్స్‌ 4.63 కోట్ల షేర్లను ఆఫర్‌ చేస్తోంది. 

ఫ్లెయిర్‌ రైటింగ్‌
పెన్నులు, స్టేషనరీ ప్రొడక్టుల తయారీ కంపెనీ ఫ్లెయిర్‌ రైటింగ్‌ ఇండస్ట్రీస్‌ ఐపీవో తొలి రోజే పూర్తి సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. షేరుకి రూ. 288–304 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 2.17 రెట్లు అధిక స్పందన నమోదైంది. కంపెనీ 1.44 కోట్లకుపైగా షేర్లను ఆఫర్‌ చేయగా.. 3.13 కోట్లకుపైగా షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. 

అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్‌) విభాగంలో 53%, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 2.78 రెట్లు, రిటైలర్ల నుంచి 2.86 రెట్లు చొప్పున బిడ్స్‌ దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా రూ. 292 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 301 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలు విక్రయానికి ఉంచాయి. 24న ముగిసే ఇష్యూ ద్వారా రూ. 501 కోట్ల వరకూ అందుకోనుంది.

గాంధార్‌ ఆయిల్‌ 
ప్రైవేట్‌ రంగ కంపెనీ గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ(ఇండియా) ఐపీవో తొలి రోజే అధిక సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. షేరుకి రూ. 160–169 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 5.5 రెట్లు అధికంగా స్పందన నమోదైంది. కంపెనీ 2.12 కోట్లకుపైగా షేర్లను ఆఫర్‌ చేయగా.. 11.72 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. 

అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్‌) విభాగంలో 1.3 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 7.7 రెట్లు, రిటైలర్ల నుంచి 6.9 రెట్ల చొప్పున బిడ్స్‌ దాఖలయ్యాయి. 24న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 501 కోట్లవరకూ అందుకోనుంది. ఇష్యూలో భాగంగా రూ. 302 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.17 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచింది.

మరిన్ని వార్తలు