టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..?

28 Dec, 2023 16:40 IST|Sakshi

టెస్లా తన కార్ల తయారీ పరిశ్రమను గుజరాత్‌లో స్థాపించే అవకాశం ఉన్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. గుజరాత్‌లో జనవరి 2024లో జరిగే సమ్మిట్‌లో ఇందుకు సంబంధించిన  ప్రకటన వెలువడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెస్లా చాలా రోజులుగా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి కేంద్రం ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్నందున ఈ అంశం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

మీడియా కథనాల ప్రకారం..గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సనంద్, ధోలేరా, బెచరాజీ ప్రదేశాల్లో ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దేశీయ, అంతర్జాతీయ డిమాండ్లను తీర్చేందుకు టెస్లా గుజరాత్ ప్లాంట్‌ను వినియోగించనున్నట్లు తెలిసింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సమక్షంలో గుజరాత్‌లో టెస్లా ప్లాంట్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని కథనాల ద్వారా తెలుస్తుంది.

టెస్లా 2021 నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని కోరుతోంది. పూర్తిగా విదేశాల్లో తయారై భారత్‌కు వచ్చే వాహనాలపై ప్రస్తుతం 100 శాతం వరకు సుంకం వర్తిస్తోంది. విలువతో సంబంధం లేకుండా ఈ సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలని టెస్లా గతంలో కోరింది. దీనికి ససేమిరా అన్న ప్రభుత్వం దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలను కొనుగోలు చేయాలని షరతు విధించింది. దీంతో టెస్లా ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది.

ఇదీ చదవండి: ‘ఎక్స్‌’లో కొత్త చాట్‌బాట్‌.. ప్రత్యేకతలివే..

ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ, ఎలాన్‌ మస్క్‌ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సైతం గతంలో కాలిఫోర్నియాలోని టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. దీంతో టెస్లా ఎంట్రీకి సంబంధించిన ప్రయత్నాలు ఊపందుకున్నాయి.

>
మరిన్ని వార్తలు